Gadwal Municipality:: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రిజర్వేషన్ల ఖరారుతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం కావడం, ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో అభ్యర్థుల వేట మొదలైంది. అగ్రస్థానాల్లో మహిళా ప్రాతినిధ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన అంకం పూర్తయింది. మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.
మున్సిపాలిటీల్లో బీసీల జోరు
జిల్లాలో ఉన్న ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల చైర్మన్ రిజర్వేషన్లలో బీసీలకు పెద్దపీట వేశారు. గద్వాల మున్సిపాలిటీ గతంలో జనరల్ కు కేటాయించగా ప్రస్తుతం జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో బీసీల కమ్యూనిటీ నుంచి చైర్ పర్సన్ లు ఎన్నిక కానున్నారు. ఈ ఎన్నికలలో మెజార్టీ అవకాశాలు రావడంతో బీసీ శ్రేణులు ఉత్సాహంతో ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
రిజర్వేషన్లతో మారనున్న రాజకీయ సమీకరణాలు
ఈ రిజర్వేషన్ల ప్రకటనతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. 50 శాతం రిజర్వేషన్ల అమలుతో మున్సిపల్ పీఠాలపై మహిళల ఆధిపత్యం పెరగనుంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన చోట అభ్యర్థులు ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతుండగా, అనుకూలించని చోట తమ అనుచరులను లేదా కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: యువతను ప్రపంచంతో పోటీ పడేల తీర్చి దిద్దుతాం.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి!
బీసీ ఓటు బ్యాంక్
ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు గణనీయమైన సంఖ్యలో మున్సిపాలిటీలు కేటాయించడం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. ఓటర్ల జాబితా కూడా సిద్ధం కావడంతో ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో జిల్లాలోని పురవీధులన్నీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తనున్నాయి. బలమైన అభ్యర్థుల అన్వేషణలో పార్టీల ముఖ్య నాయకులు పడ్డారు.
జిల్లాలో రిజర్వేషన్లు ఇలా
గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా ఆన్ రిజర్వుడ్ కింద 19 వార్డులు, బీసీలకు 13, ఎస్సీ 4, ఎస్ టి లకు ఒక వార్డ్ రిజర్వేషన్ కేటాయింపబడింది. ఐజ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను ఆన్ రిజర్వుడ్ గా పది వార్డులకు రిజర్వేషన్ ఖరారు కాగా బీసీలకు నాలుగు, ఎస్సి 5, ఎస్టిలకు ఒక వార్డ్ కు రిజర్వేషన్ ఖరారు అయింది.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా ఆన్ రిజర్వుడ్ 5 వార్డులు, బీసీలకు రెండు వార్డులు, ఎస్సీ రెండు వార్డులు, ఎస్టీ ఒక వార్డుకు రిజర్వేషన్ ఖరారు అయింది.
అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను ఆన్ రిజర్వుడ్ ఐదు వార్డులు, బిసి రెండు, ఎస్సీ రెండు, ఎస్టి లకు ఒక వార్డు రిజర్వేషన్ ఖరారు అయింది.
మహిళా స్థానాల రిజర్వేషన్లు ఖరారు
పురపాలిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలకు నిబంధనల ప్రకారం మహిళా రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సమక్షంలో అధికారులు ఖరారు చేశారు. నివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డిప్ ద్వారా గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన మహిళ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల్లో మహిళలకు కేటాయించాల్సిన 50% రిజర్వేషన్లను డిప్ విధానంలో ఖరారు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
Also Read: Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..!

