AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ నిరువుగప్పిన నిప్పులా ఉంటాయి. చిన్న అవకాశం దొరికినా చాలు.. అధికారం పక్షాల మీద విపక్షం.. ప్రతిపక్ష పార్టీలపై అధికార పక్షాలు విరుచుకుపడిపోతుంటాయి. చిన్నసందు దొరికితే చాలు ఇరుకున పెడుతుంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లపాటు కేసులు, వైసీపీకి (YSRCP) చెందిన పలువురు ముఖ్య నేతల అరెస్ట్‌లతో రాష్ట్ర రాజకీయాలు కుతకుతలాడాయి. అయితే, ప్రస్తుతం పరిస్థితి వేరేలా కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించడమో, శంకుస్థాపన చేయడమో చేస్తోంది. అభివృద్ధి పనుల స్పీడ్, డోస్‌ను పెంచింది. ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటన వెలువడడం, ఆ వెంటనే జరిగిన పెట్టుబడుల సదస్సులో భారీ ఎంవోయూలు కూటమికి కాస్త పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి సిద్ధం కావడం, తాజాగా, కాకినాడలో ఏకంగా రూ.18 వేల కోట్లతో ఏర్పాటు చేయబోతున్న ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో, వరుస శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో కూటమి నేతలు జోష్‌లో ఉండగా, ఈ పరిణామాలు ప్రతిపక్ష వైసీపీకి ఏమాత్రం మింగుడు పడవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also- Free Bus for Men: పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అన్నాడీఎంకే
డిఫెన్సివ్‌లో మోడ్‌లో వైసీపీ!
వైసీపీ అధికారంలో ఉన్నాళ్లూ పారిశ్రామికవేత్తలు, పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రం నుంచి తరలి వెళ్లాయంటూ టీడీపీ, జనసేన విస్తృతంగా ప్రచారం చేశాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని, పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటూ విస్తృత ప్రచారం, సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న వేళ, కూటమి దూకుడు వైసీపీ శ్రేణులకు ఇరుకునపడేసినట్టుగా అనిపిస్తోంది. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ వ్యూహాలకు ఈ అభివృద్ధి పనులు చెక్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు బలమైన అంశాలేవీ వైసీపీకి దొరకకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిక్కుకుండా పాలన కొనసాగుతున్నారని కూటమి నేతలు అంటున్నారు.
రాజకీయ ఆరోపణలతోనే సరి!
సూపర్ సిక్స్‌తో పాటు చాలా హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందంటూ వైసీపీ ఆది నుంచీ ముప్పేట దాడి చేస్తోంది. అయితే, జోరుగా అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో, ప్రభుత్వ పెద్దలను, టీడీపీ, జనసేన నేతలపై రాజకీయ ఆరోపణలు చేయడం వరకే వైసీపీకి అవకాశం దక్కుతోంది. గతంలో తాము మొదలుపెట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తున్నారని ఆ పార్టీ చెబుతున్నా.. ఆ వాదన పెద్దగా పేలడం లేదు. కొత్త అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు కూడా లైన్‌లోకి వస్తుండడంతో నిలదీసేందుకు వైసీపీ బలమైన పాయింట్లు దొరకడంలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాబోతున్నాం అని వైసీపీ నాయకులు గ్రౌండ్ లెవల్‌లో చెప్పుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం చేస్తున్న ‘అభివృద్ధి మార్కు’ రాజకీయం ముందు వైసీపీ వ్యూహాలు పెద్దగా పారడం లేదు. మొత్తంగా ఏపీలో ప్రస్తుతం ‘డెవలప్‌మెంట్ వర్సెస్ పాలిటిక్స్’ యుద్ధం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉండగా, వైసీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామన్న భావాన్ని క్షేత్రస్థాయిలో చొప్పించే ప్రయత్నాలు ముమ్మురంగా చేస్తోంది.

