Road Accident: అదుపుతప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన ఇనుగుర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన సంగేం శివ (21), తన బంధువులతో కలిసి అన్నారం షరీఫ్ దైవ దర్శనం కోసం వెళ్లారు. బంధువులంతా ఆటోలో వెళ్లగా, శివ తన స్నేహితులు సంగెం మహేందర్, నాంపల్లి అజయ్‌లతో కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లారు. దేవుడి దర్శనం ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో, లాలు తండా గ్రామ శివారులోని అటవీ ప్రాంతం సమీపంలో వీరి వాహనం అదుపుతప్పింది.
అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి
వేగంగా వెళ్తున్న బైక్ పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో, తీవ్ర రక్తస్రావమై సంగెం శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాహనంపై ఉన్న మహేందర్, అజయ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహేందర్, అజయ్‌లను 108 వాహనంలో అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు. చేతికి అందిన కొడుకు మరణించడంతో శివ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!
బ్రిడ్జిపై కారు బీభత్సం.. నలుగురు యువకులకు తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగపేట గ్రామ శివారులోని బ్రిడ్జిపై ఒక కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించడంతో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు మంగపేట బ్రిడ్జి వద్దకు రాగానే అకస్మాత్తుగా అదుపుతప్పింది. క్షణాల వ్యవధిలోనే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కల్లూరు గ్రామానికి చెందిన నలుగురు యువకులు తీవ్ర రక్తస్రావమై వాహనంలోనే చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన యువకులను బయటకు తీశారు. అనంతరం వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

