Bhadradri Kothagudem: సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ల సందడి, అత్తగారింటి ఆతిథ్యం. అయితే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచలో జరిగిన ఓ విందు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పండుగ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, తమ కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఓ కుటుంబం ఏకంగా 271 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేసింది.
ఒకేచోట 271 రకాల రుచులు
పాల్వంచ పట్టణం హైస్కూల్ రోడ్డులో నివాసముంటున్న గర్రె శ్రీనివాసరావు, పారిజాతం దంపతుల కుమార్తె ప్రణీతకు, దత్త రామకృష్ణతో వివాహం జరిగింది. వివాహానంతరం వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో, అల్లుడికి అరుదైన రీతిలో స్వాగతం పలకాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 271 రకాల పిండివంటలు, స్వీట్లు, హాట్లు, వివిధ రకాల సంప్రదాయ వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. టేబుళ్లపై వరుసగా పేర్చిన వంటకాలను చూసి అల్లుడితో పాటు బంధుమిత్రులు కూడా అబ్బురపోయారు.
Also Read:Bengaluru: బెంగళూరులో విషాదం.. భవనం పై నుంచి దూకి యువ ఉద్యోగి ఆత్మహత్య
సంప్రదాయానికి సరికొత్త మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి నాడు కొత్త అల్లుడిని ఆహ్వానించి పిండివంటలు వడ్డించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే ఈ మధ్య కాలంలో వందల సంఖ్యలో వంటకాలు వడ్డించే సంస్కృతి పెరుగుతుంది. ఈ క్రమంలోనే గర్రె శ్రీనివాసరావు దంపతులు తమ కూతురు, అల్లుడిపై ఉన్న మమకారంతో అత్యంత ఘనంగా ఈ విందును నిర్వహించారు. సంప్రదాయాలను కాపాడుతూ, కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమం సాగింది.
ఆదర్శంగా నిలిచిన కుటుంబం
ఈ భారీ విందును చూసిన స్థానికులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గర్రె దంపతులను అభినందించారు. సాధారణంగా వంద రకాల లోపు వంటకాలతో ఆతిథ్యం ఇవ్వడం చూస్తుంటామని, కానీ ఏకంగా 271 రకాలతో విందు ఇవ్వడం విశేషమని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన విందుకు సంబంధించిన ఫోటోలు జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

