CPI And CPM alliance: ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభలో సీపీఎం,(CPI) సీపీఐకు (CPM )చెందిన సభ్యుల ప్రాతినిథ్యం సైతం ఉండేది. రెండు పార్టీలు ఏ ఎన్నికలు వచ్చినా కలిసి పోటీ చేసేవి. తమ ఉనికిని చాటివి. కానీ, దశాబ్ద కాలంగా ఉనికిని చాటలేకపోతున్నాయి. పైగా, కలిసి పోటీ చేయకపోవడంతో ప్రతి ఎన్నికల్లో చతికిల పడుతున్నాయి. ప్రజా సమస్యలపై పార్టీలు, అనుబంధ సంఘాలు ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. దీనికి కారణం రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోవడమే అని రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతమెంతో ఘనం
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ దిశగా ముందుకు సాగలేదు. ప్రజా కూటమిలో సీపీఐ భాగస్వామి అయింది. కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి నాయకత్వం వహించింది. సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగింది. అయినప్పటికీ ఈ రెండు పార్టీలు ఒక స్థానంలో కూడా విజయం సాధించలేకపోయాయి. దాంతో ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలు బలంగా ఉన్నప్పటికీ, కేవలం ఆ సంఘ ఎన్నికల్లో మాత్రం విజయం సాధిస్తూ, పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాట లేకపోయాయి.
Also Read: CPIM John Wesley: త్రిపుల్ ఆర్ రోడ్డు ఆలైన్ మెంట్ మార్పుల్లో కుట్రలు: జాన్ వెస్లీ
సిపిఐకి కలిసి వచ్చిన 2023 ఎన్నికలు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ పని చేసింది. ఒప్పందం ప్రకారం కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో విజయం సాధించింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థానం సైతం దక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. కానీ, ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగానే పోటీ చేశాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కలిసి పని చేస్తాయా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నెల 18న జరగబోయే సీపీఐ 100 సంవత్సరాల వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో పురపాలక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం.
సీపీఎం ఒంటరి ప్రయాణం
సీపీఎం పార్టీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పోతే సీపీఎం ఆశలు వదులుకోవాల్సిందే. కలిసి పోయేందుకు ఇరు పార్టీల నేతలు అనుకూలంగా ఉన్నప్పటికీ, అధిష్టానాలు మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నప్పటికీ గెలిచే అవకాశం లేదు. కేవలం గెలుపు ఓటములను నిర్దేశించిన స్థాయిలోనే ఉన్నారు. ఏదైనా పార్టీతో పొత్తు ఉంటే మాత్రం కొన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు చెందిన నాయకుడు హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు చేయించారని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఎం కలిసి ముందుకు సాగదని ప్రచారం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కామ్రేడ్లు కలిసిపోతారా? ఒంటరిగానే పోటీ చేస్తారా? ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది చూడాలి.
Also Read: CPI: సీపీఐ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు సముచిత స్థానం!

