CPIM John Wesley: రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కోసం బలవంతంగా భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామసభలను నిర్వహించి రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూమిని తీసుకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయం ముందు భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. 2013 చట్టంలోని షెడ్యూల్ 1లో చూపిన విధంగా మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ఫార్మా సంస్థల యాజమానులు, ధనికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే అలన్ మెంట్ లో ప్రభుత్వం మార్పులు చేస్తుందని ఆరోపించారు. అలైన్ మెంట్ మార్పు, భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భూమికి భూమి ఇవ్వాలి..
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ రాజకీయ నాయకులు, వ్యాపారులు, ధనికులు భూమి కోల్పోకుండా చిన్న రైతులు, పేదల భూములను మాత్రమే తీసుకునేలా అలైన్ మెంట్ మారుస్తున్నారని ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు ప్రకటించి మార్కింగ్ చేస్తున్నారన్నారు. ఇలా చేస్తే ఏ ఒక్క రైతు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరన్నారు. తరతరాలుగా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నారని వివరించారు. అయినా బలవంతంగా ఆ భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. భూమికి భూమి ఇవ్వాలనే నిబంధనను పట్టించుకోవడం లేదన్నారు. ఎకరా రూ.10 కోట్ల నుంచి రూ. ఐదు కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం రూ. పది లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 కోట్లు పరిహారం ఇస్తుందన్నారు. రైతుల ఆమోదం లేకుండా సెంటు భూమి తీసుకున్నా సహించేది లేదన్నారు.
Also Read: Ram Gopal Varma: ‘శివ’ సినిమాపై రామ్ గోపాల్ వర్మ వైరల్ పోస్ట్.. పుట్టిన రోజా!
భూసేకరణకు గ్రామ సభలు నిర్వహిస్తాం..
త్రిపుల్ ఆర్ రోడ్డు కోసం జరుపుకున్న భూ సేకరణకు సంబంధించి నిర్వాసితులు కోరిన విధంగానే గ్రామ సభలు నిర్వహిస్తామని హెచ్ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలైన్ మెంట్ లో మార్పులకు నిరసనంగా ధర్నా చేస్తున్న నిర్వాహితులను ఆయన కలిశారు. ఈ మేరకు నిర్వాసితులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్(RRR) అలైన్ మెంట్ రూపకల్పన చేసి హెచ్ఎండీఏ(HMDA) మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అలైన్ మెంట్ పై వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆలైన్ మెంట్ ఉత్తర భాగం పూర్తయ్యిందని, దక్షిణ భాగం ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు. భూసేకరణ వరకు ఇంకా వెళ్లలేదన్నారు. అలైన్ మెంట్ కు పబ్లిక్ నోటీసు ఇచ్చామని, గ్రామసభలు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, బి ప్రసాద్, కొండమడుగు నర్సింహ్మా, ప్రజాసంఘాల నాయకులు కోట రమేష్, ఎం శోభనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సై.. బీ ఫామ్ ల కోసం ఆశావహులు ప్రయత్నాలు
