CPI: జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి
మరోసారి జాతీయ కార్యవర్గంలోకి కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మకు చోటు
కంట్రోల్ కమిషన్ సభ్యులుగా యూసుఫ్
జాతీయ సమితిలోకి 10 మంది
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సీపీఐ జాతీయ కార్యవర్గంలో (CPI) తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం దక్కిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇన్నాళ్లూ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా వైదొలగారు.
నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా వెంకట్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. క్రమంగా జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. ఆయన సీపీఐ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. గతంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా, 2004లో మునుగోడు నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. సీపీఐ జాతీయ కార్యవర్గానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఎన్నికయ్యారు. ఇక, కంట్రోల్ కమిషన్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎండీ యూసుఫ్ ఎన్నికయ్యారు. కంట్రోల్ కమిషన్ సభ్యులుగా ఆయన జాతీయ సమితికి శాశ్వతాహ్వానితులుగా ఉండనున్నారు.
Read Also- ICC Warning: కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ వార్నింగ్.. జరిమానా విధించే ఛాన్స్!
10 మంది జాతీయ సమితి సభ్యులు వీరే
రాష్ట్రం నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గంలోకి పది మంది సభ్యులు ఎన్నికయ్యారు. కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, పల్లా వెంకట్ రెడ్డి, తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నర్సింహా, బాగం హేమంతరావు, కలవేన శంకర్, ఎం.బాలనర్సింహా, ఎస్‌కే. సాబీర్ పాషా ఉన్నారు. క్యాండిడేట్ సభ్యుడిగా పాల్మాకుల జంగయ్య ఎన్నికయ్యారు. వీరిలో ఎస్‌కే.సాబీర్ పాషా, పాల్మాకుల జంగయ్య తొలిసారిగా ఎన్నికయ్యారు.
సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ కే.నారాయణ
సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఎన్నికయ్యారు. తొలుత చండీగఢ్ జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభ చివరి రోజున ప్రతినిధులు సెంట్రల్ కంట్రోల్ కమిటీ సభ్యులుగా 11 మందిని ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో డాక్టర్ కె.నారాయణ, హర్ సింగ్ ఆర్శీ (పంజాబ్), ఎం.డి.యూసుఫ్(తెలంగాణ), కల్యాణ్ బెనర్జీ (పశ్చిమ బెంగాల్), పి.దుర్గా భవాని (ఆంధ్రప్రదేశ్), ఆర్.ముత్తురాసన్ (తమిళనాడు), రామ్ బహేతి(మహారాష్ట్ర), ఇంతియాజ్ అహ్మద్ (ఉత్తర్ ప్రదేశ్), సత్యన్ మొకెరి(కేరళ), సి.హెచ్.వెంకటాచలం, రామ్ రతన్ సింగ్ (బిహార్)లు ఉన్నారు. అనంతరం కమిటీ సమావేశమై సెంట్రల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.నారాయణను, కార్యదర్శిగా రామ్ బహేతిని ఎన్నుకుంది.