Mahesh Kumar Goud: తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని, 70 శాతం స్థానాల్లో విజయం సాధించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో పార్టీ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టారని విమర్శలు గుప్పించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి విజనరీ నాయకత్వంలో పెట్టుబడుల వరద పారుతోందని పేర్కొన్నారు. గత ఐటీ మంత్రిగా కేటీఆర్ చేయలేని పనిని, రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ద్వారా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి నిరూపించారని ప్రశంసించారు.
రేవంత్ విజనరీతో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని పీసీసీ చీఫ్ తెలిపారు. పేదలకు మేలు చేసేలా తమ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు కావడం లేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ జిల్లాలో కొందరు పెద్దలు బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని, ఇప్పుడు అటువంటి వాటికి తావులేకుండా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రేవంత్ ఒక విజనరీ లీడర్ అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి జరుగుతోందని మహేశ్ కొనియాడారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే గొప్ప నగరంగా రూపుదిద్దుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు
శ్రీరాముడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడగడంపై మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా?’ అని ప్రశ్నిస్తూ, దేవుడి పేరును రాజకీయ స్వార్థానికి వాడుకోవద్దని సూచించారు. రాముడి పేరు చెప్పే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు? అని సూటి ప్రశ్న సంధించారు. దేవుళ్ళ పేరుతో గెలిచిన కమలం పార్టీ దేశ ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత అందరూ కలిసి పని చేయాలన్నది తన అభిప్రాయమన్నారు. దయచేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని బీజేపీ నేతలకు మహేశ్ సూచించారు.
పేరు మారిస్తే ఒరిగేదేంటి?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత ఏడేళ్లలో జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమాబాద్‌ను ఇందూరుగా మారిస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయా?, పేర్ల మార్పు వల్ల ప్రజల జీవితాల్లో మార్పు రాదని, అభివృద్ధి వల్లనే వస్తుందని మహేశ్ హితవు పలికారు. జిల్లా అభివృద్ధి కోసం ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, బాసరలను కలుపుతూ టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, కరీంనగర్-నిజామాబాద్ మధ్య 4 లైన్ల రహదారిని నిర్మిస్తామని వెల్లడించారు. ఓటర్ లిస్టుల్లో తప్పులకు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం, ప్రయత్నం కొనసాగుతాయని చెప్పారు. బీఆర్ఎస్ శకం ముగిసిందని, కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదని టీపీసీసీ చీఫ్ ఎద్దేవా చేశారు.
Also Read: Minister Ponguleti: రాష్ట్రంలో అక్రమార్కుల భరతం పడతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

