Bhatti Vikramarka: రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నిర్మాణ ప్రగతిపై సమీక్షించారు. ఈ పాఠశాలల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. టెండర్లు పూర్తయిన చోట వెంటనే భూమి పూజలు చేయించాలని, భవనాల పూర్తికి నిర్దిష్ట క్యాలెండర్ ఫిక్స్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు ప్రతి వారం ప్రగతిని సమీక్షించాలని, నెలలో ఒకసారి నిర్మాణ ప్రాంతానికి స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. స్కూల్స్ నిర్మాణానికి నిధుల కొరత లేదని, ప్రతి 15 రోజులకోసారి బిల్లుల చెల్లింపులు జరుగుతాయని భట్టి భరోసా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటివరకు విడివిడిగా ఉన్నాయని, వీటన్నింటినీ ఒకే చోట చేర్చి తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. సమాజంలో వర్గాలుగా విడగొట్టబడిన వారందరినీ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోనే గేమ్ ఛేంజర్..
ఈ పాఠశాలలు దేశంలోనే ఒక రోల్ మోడల్‌గా, గేమ్ చేంజర్లుగా మారనున్నాయని విక్రమార్క వెల్లడించారు. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోతే కలెక్టర్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అత్యధిక శాతం స్కూల్స్ అందుబాటులోకి రావాలని, భూమి సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే లేదా సీఎస్ సహకారంతో వెంటనే పరిష్కరించుకోవాలని భట్టి సూచించారు. భవనాల నిర్మాణంలో నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు థర్డ్ పార్టీ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని, ఆ బృందం నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు. పనుల ప్రగతిపై వారానికి ఒకసారి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ల నుంచి నివేదిక తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిబద్ధతతో సేవ చేయాలి
ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోందని భట్టి పేర్కొన్నారు. సోమవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-1 సాధించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థులు భవిష్యత్తులో సమాజంలో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటును అందించాలని కోరారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని భట్టి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టడీ సర్కిల్స్‌లో మౌలిక వసతులను భారీగా మెరుగుపరిచామని, రాబోయే రోజుల్లో వీటిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ ముందున్న ఎకరన్నర స్థలాన్ని బాగు చేయించి, అక్కడ నిరంతర విద్యా సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.
దివ్యాంగుల పెళ్లికి రూ. 2 లక్షల కానుక
కాంగ్రెస్ ప్రభుత్వానిది మనసున్న ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి తమ కేబినెట్ పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. గతంలో కేవలం కొన్ని శాఖలకే పరిమితమైన సంక్షేమాన్ని, ఇప్పుడు దివ్యాంగులతో సహా అన్ని వర్గాలకు విస్తరించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగ జంట వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పదేళ్లలో రూ. 60 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ. 100 కోట్లు వెచ్చించిందని ఆయన గుర్తుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన దివ్యాంగులకు అవసరమైన రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లను ప్రభుత్వమే పూర్తి ఖర్చుతో అందజేస్తుందని భట్టి తెలిపారు. అలాగే, దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను గుర్తిస్తూ, వారికి పదోన్నతి లభించినా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతంలోనే కొనసాగేలా జీవో 34 జారీ చేశామని డిప్యూటీ సీఎం చెప్పారు.
Also Read: CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పది శాతం జీతం కట్: సీఎం రేవంత్ రెడ్డి

