Huzurabad: యువతే ఈ దేశాన్ని మార్చే శక్తి అని, సమాజాన్ని నడిపే ఇంధనమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర ఎస్.ఎఫ్.డి కో-కన్వీనర్ గోస్కుల అజయ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు మళ్ళి, రామకృష్ణ పరమహంస శిష్యునిగా సన్యాసం స్వీకరించిన వివేకానందుడు భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. చికాగో ప్రసంగం ద్వారా భారతీయత గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు.
Also Read:Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి.. ఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదే!
నేడు విద్య వ్యాపారంగా మారుతుంది
“లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అన్న వివేకానందుని పిలుపు నేటి యువతకు మార్గదర్శకమని అజయ్ పేర్కొన్నారు. విద్యార్థి అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, దేశ భవిష్యత్తును భుజాన మోసే యోధుడిగా ఉండాలని ఆకాంక్షించారు. నేడు విద్య వ్యాపారంగా మారుతున్న తరుణంలో, యువతను పెడదారి పట్టించే శక్తులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తిని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్న ఇలాంటి సమయంలో, వివేకానందుని భావజాలంతో విద్యార్థి సమస్యలపై పోరాడే ఏకైక సంఘం ఏబీవీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన వంద మంది యువకులను ఇస్తే ప్రపంచాన్ని మారుస్తాను” అన్న వివేకానందుని మాటలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి వివేకానందుని జీవిత చరిత్రను చదివి, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దేశం కోసం, సమాజం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర సంయుక్త కార్యదర్శి సిద్దు, రాంచరణ్, అఖిల్, రతుల్ భార్గవ్, మారుతి, విజయ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

