CM Revanth Reddy: జిల్లా పునర్విభజనపై జ్యూడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఇది పని చేస్తుందని చెప్పారు. కమిషన్ రాష్ట్రమంతా పర్యటిస్తుందని, ప్రజల సూచనలు, సలహాలు తీసుకొని ఆరు నెలల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ అందివ్వాలని కోరతామన్నారు. జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ ప్రభుత్వానికి వచ్చాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారని సీఎం ఫైరయ్యారు. సోమవారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కార్యాలయం నిర్మాణానికి సహకరిస్తామన్నారు. బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందివ్వాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Black Jaggery: యథేచ్చగా నల్ల బెల్లం దందా.. పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా?
ఫాంహౌస్‌లో శుక్రాచార్యుడు
సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అంటుంటారని, కానీ ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదన్నారు. ఒకే కుటుంబంలో కుమ్మక్కులు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని చెప్పారు. దేవతలు కూడా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఒక శుక్రాచార్యుడు ఫాంహౌస్‌లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని తమ ప్రభుత్వంపై మోపి వెళ్లిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లు మాత్రమే అని, కానీ ప్రతీ నెలా ఏకంగా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Also Read: Bangladesh-ICC: వరల్డ్ కప్ వేదికలు మార్చాలంటున్న బంగ్లాదేశ్‌కు షాకివ్వబోతున్న ఐసీసీ!

