Harish Rao: విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా? ముఖ్యమంత్రిగా ఉంటూ మన నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న చారిత్రక ద్రోహం కాదన్నారు.
సూట్ ఫైల్ చేస్తాం
రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే అని అన్నారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుందని, సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్ సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అన్నారు. పోలవరం నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నది. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు డిల్లీ మీటింగ్ కు వెళ్ళాడు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపాడు.పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడు. వేయను అంటూనే కమిటి వేసి ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టు కు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు.
బనకచర్లను అడ్డుకుంటాం
పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించాడని మండిపడ్డారు. మేం నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటాం, సుప్రీంకోర్టుకు వెళ్తాం అని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడన్నారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు మనమే కూర్చొని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటి?. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్ప చెప్పడమేనా మీ చర్చల లక్ష్యం..తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. రేవంత్ రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.. ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తాం అని ప్రకటించారు.
Also Read: Harish Rao: పాలమూరు ప్రాజెక్ట్‌పై ఒక్క అనుమతైనా తెచ్చారా? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!

