Malla Reddy: రాష్ట్రంలో ప్రజా పాలన పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల మౌలిక సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా మేడ్చల్ ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మేడ్చల్‌లో నెలకొన్న తాగునీటి సమస్యపై జలమండలి అధికారులను కలిసి మల్లారెడ్డి (Malla Reddy) వినతిపత్రం అందజేశారు.
ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, జనవరి నెలలోనే నీటి సమస్య తలెత్తితే రాబోయే వేసవిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడా తాగునీటి ఎద్దడి ఉండేదే కాదని, కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారం రోజుల్లో మేడ్చల్ నీటి సమస్యను పరిష్కరించకపోతే భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
Also Read: Malla Reddy Son: మల్లారెడ్డి కుమారుడి ఇంటిలో ఐటీ అధికారులు.. నిజమేనా?
మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై కూడా మల్లారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణాలకు బేస్‌మెంట్ దశకే నిధులు విడుదల చేయని పరిస్థితి నెలకొందని, లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి నాయకులు కొబ్బరికాయలు కొట్టుకుంటూ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి మేడ్చల్ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఆపాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి,మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ కో ఆప్షన్ మెంబర్ నవీన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గణేష్, సందీప్ గౌడ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
Also Read:Mallareddy University: మల్లారెడ్డిలో గూగుల్ క్లౌడ్ డిజిటల్ క్యాంపస్ ప్రారంభం

