Mallareddy University: గొప్పగా కలలు కనండి, సాకారానికి కృషి చేయండి. కలలు లేకుంటే జీవితమే లేదు” అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గూగుల్ ఇండియా మల్లారెడ్డి యూనివర్సిటీతో కలిసి అతిపెద్ద గూగుల్ క్లౌగ్ డిజిటల్ క్యాంపస్ను బుధవారం ప్రారంభించారు.
మల్లారెడ్డిలో గూగుల్ క్లౌడ్ డిజిటల్ క్యాంపస్ ప్రారంభం
గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, గూగుల్ సంస్థ ప్రతినిధులతో కలిసి క్యాంపస్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందన్నారు. యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, దేశ ఉజ్వల భవిష్యత్కు కృషి చేయాలన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకొని గొప్పగా కలలు కనాలన్నారు. ఆయన కలలను సాకారం చేసుకునేందుకు చేసిన ఉన్నతమైన కృషి కారణంగా నేడు వేలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థలను స్థాపించ గలిగారన్నారు. ఆయనలో కన్పిస్తున్న జోషే ఈ విజయానికి కారణంగా కన్పిస్తుందని చెప్పారు. లాల్బహుదూర్ శాస్త్రీ జై జవాన్, జై కిసాన్ అంటే, ప్రధాని వాజ్పేయి జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అన్నారని, ప్రస్తుత ప్రధాని మోడీ జై విజ్ఞాన్ తో పాటు జై అనునంధాన్ అన్నారని చెప్పారు. గూగుల్ ఇండియాతో కలిసి మల్లారెడ్డి యూనివర్సిటీలో అతి పెద్ద డిజిటల్ క్యాంపస్ ను ప్రారంభించం అనుసంధానంలో భాగమే అన్నారు.
విద్యార్థులు, యువత కలలు సాకారం చేసుకునేందుకు గూగుల్ సంస్థ కృషి చేయడం హర్షనీయమన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, ఇక్కడికి తరలివచ్చిన వేలాది మంది విద్యార్థులు యువత చేసే అరుపుల్లో దేశ ఉన్నత భవిష్యత్ కన్పిస్తుందన్నారు. ఇదో ఒకటి సాధిస్తారన్న నమ్మకం కల్గుతుందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ స్థాయి నుంచి జరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను, యువతను ఉన్నత విద్యను అందిస్తే దేశం ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి నైపుణ్యాలు, సాంకేతికతను అనుసంధానం చేసే దిశగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
