PSLV C62-EOS N1: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) సోమవారం ఉదయం చేపట్టిన ప్రయోగంలో విజయానికి కేవలం కొన్ని సెకన్ల ముందు అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఈవోఎస్-ఎన్1 (EOS N1) మిషన్‌ను మోసుకెళ్తూ నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ-సీ 62లో (PSLV-C62) క్రమరాహిత్యం ఏర్పడినట్టుగా ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. రాకెట్ మూడవ దశలో విచలనాన్ని గుర్తించారు. అంటే, ముందుగా నిర్దేశించిన క్రమంలో వ్యత్యాసం ఏర్పడింది. దీంతో, శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా?, లేక, వైఫల్యం చెందిందా? అన్న విషయాన్ని ఇస్రో వెల్లడించలేదు. అయితే, ఇస్రో చైర్మన్ డా వి. నారాయణన్ స్పందిస్తూ, డేటాను విశ్లేషిస్తున్నామని, వీలైనంత త్వరగా వివరాలను పంచుకుంటామని చెప్పారు.
Read Also- POCSO Cases: పసి పిల్లలపై పెరుగుతున్న లైంగిక దాడులు.. 99 శాతం కేసులో వీరే అసలైన నిందితులు..?
16 శాటిలైట్స్ పోయినట్టే!
ప్రతిష్టాత్మక ఈ ప్రయోగ ఫలితంపై ఇస్రో ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ, మిషన్ విఫలం అయినట్టేనని నిపుణులు చెబుతున్నారు. రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన 16 శాటిలైట్స్ వృథా అయినట్టేనని అంటున్నారు. కాగా, శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి రెండు దశల్లోనూ అద్భుత పనితీరు కనిపించింది. అయితే, మూడవ దశలోకి ప్రవేశించిన తర్వాత అసాధారణ పరిస్థితిని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. టెలీమెట్రీ అప్‌డేట్స్ అందలేదు. దాంతో రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించే విషయంలో వైఫల్యం ఎదురైంది. మొదటి రెండు దశల్లో శాస్త్రవేత్తల్లో హర్షధ్వానాలు కనిపించగా, మూడవ దశలో అందరినీ నిరాశ ఆవహించింది. ఇస్రో అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.
పీఎస్ఎల్‌వీ నుంచి చేపట్టిన ఈ ప్రయోగం 64వది. అనూహ్యంగా విఫలం కావడంతో నూతన సంవత్సరంలో చేపట్టిన తొలి ప్రయోగమే విఫలమైనట్టు అయ్యింది. పీఎస్‌ఎల్వీ సీ-62 రాకెట్ ద్వారా 16 శాటిలైట్స్‌ను నింగిలోకి పంపించారు. ఇందులో ఈవోఎస్-ఎన్1 ముఖ్యమైనది. దీనిని అన్వేష్ అని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. భూమి పరిశీలన కోసం ఈ మిషన్‌ను డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. మిగతా 14 ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో (Sun Synchronous Orbit) ప్రవేశపెట్టాల్సి ఉంది. కెట్రెల్ ఇనిషియల్ డెమాన్ట్రేటర్ (KID) ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి వెళ్లే మార్గంలో ప్రవేశపెట్టాల్సి ఉంది.
Read Also- PSLV C62-EOS N1: నింగిలోకి ఎగసిన తర్వాత రాకెట్‌లో క్రమరాహిత్యం.. అంతరిక్షంలో 16 శాటిలైట్స్ వృథా !

