POCSO Cases: అభం శుభం తెలియని పసిపిల్లలపై లైంగిక దాడులు ఏయేటికాయేడు పెరిగిపోతున్నాయి. అయిదారేళ్ల వయసున్న బాలికలను సైతం కొంతమంది తమ వికృత వాంఛలకు బలి చేస్తున్నారు. కొందరు మృగాళ్లు బాలురపై కూడా అఘాయిత్యాలు జరుపుతున్నారు. గడిచిన అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పోక్సో చట్టం ప్రకారం నెలకు 283 కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే 99 శాతం కేసుల్లో బాధితులకు బాగా తెలిసిన వారే నిందితులుగా ఉండడం. వీరిలో జన్మనిచ్చిన వారు, తోబుట్టువులు, బంధువులు, టీచర్లు, ట్యూషన్ మాస్టర్లు, ఇరుగుపొరుగు వారు ఉంటున్నారు. పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో యావజ్జీవ శిక్షలు, కొన్నిసార్లు మరణశిక్షలు పడుతున్నా నేరాలు మాత్రం తగ్గడం లేదు.
ఐదేళ్లలో ఎన్నో దారుణాలు
2020 నుంచి 2025 మధ్య రాష్ట్రం మొత్తం మీద పోక్సో చట్టం ప్రకారం 16,994 కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. గమనించాల్సిన అంశం ఏమిటంటే ట్రై కమిషనరేట్లలోనే ఎక్కువగా కేసులు నమోదుతుండడం. 2,619 కేసులతో రాచకొండ కమిషనరేట్ మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో 2,293 కేసులతో హైదరాబాద్ నిలిచింది. 2,026 కేసులతో సైబరాబాద్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉన్నది. గడిచిన ఐదు సంవత్సరాల్లో నమోదైన కేసుల సంఖ్య వేలల్లో ఉండగా కేవలం 188 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి.
మత్తు.. మొబైల్ ఫోన్లు..
ఏయేటికాయేడు ఈ తరహా నేరాలు పెరిగిపోతుండడానికి మత్తు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఆ తరువాత అరచేతుల్లోకి వచ్చేసిన మొబైల్ ఫోన్లు కూడా ఈ తరహా దారుణాలకు దారి తీస్తున్నాయి, ఆందోళనకరమైన అంశం ఏమిటంటే చాలా కేసుల్లో జన్మనిచ్చిన తండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, దగ్గరి బంధువులు, చదువులు చెప్పాల్సిన టీచర్లు ఈ నీచాలకు పాల్పడుతుండడం. వనపర్తిలో ఓ ట్యూషన్ మాస్టర్ తన వద్ద చదువుకోవడానికి వచ్చిన 4వ తరగతి విద్యార్థినుల్లో 11 మందిపై లైంగిక దాడులకు పాల్పడి చివరకు కటకటాల పాలయ్యాడు. షాద్ నగర్లో ఓ వ్యక్తి కూతురిపైనే కొన్ని నెలలపాటు అఘాయిత్యం జరిపాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పు గమనించి స్కూల్ టీచర్లు ప్రశ్నించినప్పుడు ఆ చిన్నారి తండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. అప్పటికే బాలిక గర్భవతి అయ్యింది. మైనారిటీ తీరని యువకులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ప్రధాన కారణం ఇంటర్ నెట్ అన్నది సుస్పష్టం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద కూడా మొబైల్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. తెలిసీ తెలియని వయసులో సెల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్న వారిలో కొందరు అలాంటి అనుభవం కోసం దారుణాలకు తెగిస్తున్నారు.
Also Read: Telangana Budget: తెలంగాణ స్టేట్ బడ్జెట్ రూపకల్పనపై అధికారుల ఫోకస్.. అన్ని శాఖల్లో బిజీ బిజీ!
తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా..
తల్లిదండ్రులు పిల్లల పట్ల కనబరుస్తున్న నిర్లక్ష్యం కూడా ఈ నేరాలు పెరుగుతుండడానికి కారణమవుతున్నది. చాలామంది తల్లిదండ్రులు పదో తరగతిలోకి రాగానే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. తప్పితే పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారు? ఏం బ్రౌజ్ చేస్తున్నారు? అనే విషయాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో పిల్లలు ఫోన్లలో పోర్న్ వెబ్ సైట్లు చూస్తున్నారు. వాటి ప్రభావంతో మంచీ చెడు తెలియని వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు కటకటాల పాలవుతున్నారు.
కచ్చితంగా నిఘా పెట్టాలి
ఫోన్ కొనివ్వడంతో సరిపోయిందన్నట్టుగా కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫోన్ చేతికి ఇచ్చే ముందే అశ్లీల సైట్లు చూడకుండా సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటిని బ్లాక్ చేయాలన్నారు. ప్రస్తుతం పిల్లలు తెలివి మీరిపోయారని చెబుతూ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నారన్నారు. ఇక, ఉద్యోగాలు చేస్తున్నామని పిల్లలకు టైం ఇవ్వకపోవడం కూడా పలుమార్లు నేరాలకు దారి తీస్తున్నట్టు చెప్పారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా రోజులో కనీసం గంట సమయమన్నా పిల్లలకు ఇవ్వాలన్నారు. వాళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా చెప్పుకొనే వెసులుబాటును కల్పించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. స్కూళ్లలో ఉపాధ్యాయులు కూడా దీని గురించి పిల్లలకు చెప్పాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే కుటుంబం పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండి పోవద్దన్నారు. ఇలా చేస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి మరింత ధైర్యం వచ్చి నేరాలను కొనసాగిస్తారన్నారు. కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. బాధితుల వివరాలను దర్యాప్తు అధికారులు గోప్యంగా పెడతారని చెప్పారు.
శిక్షలు పడేలా చూడాలి
పోక్సో చట్టం ప్రకారం నమోదవుతున్న కేసుల్లో పోలీసులు, అధికారులు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఆయా కేసుల్లో నిందితులకు పడుతున్న శిక్షల గురించి మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారిలో భయం పుడుతుందని అంటున్నారు.
Also Read: Telangana Power: మీ ఇంట్లో కరెంటు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

