Telangana Power: తెలంగాణ విద్యుత్ శాఖ సమర్థవంతమైన పాలన, పారదర్శకత లక్ష్యంగా నేరుగా ప్రజల ముంగిటకే వెళ్తున్నది. వినియోగదారుల సేవలో కొత్త పుంతలు తొక్కుతున్నది. దాదాపు 83 లక్షల మంది వినియోగదారుల అవసరాలను తీరుస్తూ, మరింత పారదర్శకమైన పాలనను అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ‘ప్రజా బాట’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన విద్యుత్ యంత్రాంగం, ఇప్పుడు వ్యక్తిగత లేఖల ద్వారా ప్రతి ఇంటికీ చేరువవుతున్నది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన గృహజ్యోతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 52,82,498 మంది వినియోగదారులు ఉచిత విద్యుత్ లబ్ధిని పొందుతున్నారు. అటు అన్నదాతలకు అండగా ఉంటూ 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన కరెంటును సర్కార్ సరఫరా చేస్తున్నది. దాదాపు 83 లక్షల మంది విద్యుత్ వినియోగదారుల వద్దకు అధికారులు వెళ్లేలా కార్యాచరణను ఫిక్స్ చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఇప్పటికే శాఖకు చెందిన అధికారులు పలువురి ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. ఈ రెండు విభాగాల్లోని భారీ సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాల వివరాలను వివరిస్తూ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక సందేశంతో కూడిన లేఖలను అందజేస్తున్నారు.
ఇంటింటికీ..
విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్య మంత్రి నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన సందేశ లేఖలను గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నారు. వినియోగదారుడి పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్‌తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు, అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడి, భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
వినియోగదారుల హర్షం
ఇక, తమ పేరుతో ప్రత్యేకంగా ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క నుంచి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షల లేఖ అందడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రజా ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, కొత్త కనెక్షన్ల జారీ, ఫిర్యాదుల పరిష్కారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం పెరిగింది. ఇప్పటికే ప్రజా బాట కార్యక్రమం ద్వారా డిస్కంలు బస్తీ పర్యటనలు, నేరుగా వెళ్లి ప్రజలను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖలో అవినీతికి తావు లేకుండా పారదర్శకతను పెంచేందుకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో డిజిటల్ సేవల వినియోగాన్ని మరింత పెంచి, వినియోగదారులకు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చర్యలు చేపడుతున్నారు.
Also Read: Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!

