Sarpanch Rights: సర్పంచులను చంపడానికి మీరెవ్వెవరూ?
–బెదిరింపులకు దిగిన జడ్చర్ల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
–మంచి, చెడులను చూసే సర్పంచులను ఎన్నుకుంటారు
–నిధులను ఆపే అధికారం ఏ ఒక్క ఎమ్మెల్యేకు లేదు
–మైనింగ్, స్టాంప్ డ్యూటీ ఫీజులను జీపీలకే అప్పగించాలి
–సర్పంచుల చైతన్య సదస్సులో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: ‘అన్ని ఎన్నికల్లో కన్నా.. సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నిక చాలా క్లిష్టమైందని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి(Sathyanarayan Reddy) అన్నారు. అభ్యర్థుల మంచి చెడులను చూసే ఓటర్లు వారిని ఎన్నుకుంటారని తెలిపారు. ఎన్నికల తర్వాత పార్టీ మారేందుకు నిరాకరించిన అలాంటి గొప్ప వ్యక్తులను చంపు తామంటూ బహిరంగ బెదిరింపులకు దిగిన జడ్చర్ల ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యే అర్హతను రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రజల చేత ఎన్నికైన సర్పంచులను చంపడానికి ఆయనెవరూ? నీవు ఎమ్మెల్యేవా? లేక వీధి రౌడీవా? అంటూ’ చింపుల సత్యనారాయణరెడ్డి ఘాటూగా విమర్శించారు.
ఇందులో ఎమ్మెల్యేల ప్రమేయం
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్, రంగారెడ్డి(Rangareddy)జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్పంచుల చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంపుతామంటే భయపడేందుకు సర్పంచులేమి పిరికివాళ్లు కాదన్నారు. క్షేత్రస్థాయిలో అనేక కష్టానష్టాల కోర్చి.. ప్రజల మన్నలను పొందిన సర్పంచులు, వార్డు సభ్యులను భయపెట్టాలని చూస్తే తాము చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే తన దొర అహంకారాన్ని తగ్గించుకోవాలని హితువుపలికారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా నిధులను విడుదల చేస్తాయని, ఇందులో ఎమ్మెల్యేల ప్రమోయం ఏమాత్రం ఉండదన్నారు. ఎమ్మెల్యేలకు నిధులకు అసలు సంబధమే లేదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే సహించబోమని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే సర్పంచులంతా కలిసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోరని హెచ్చరించారు.
Also Read: TG Health Department: ఆరోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు? బడ్జెట్ ప్రపోజల్ సిద్ధం చేస్తున్న అధికారులు!
ప్రతి పంచాయతీకి రూ.50 లక్షల బడ్జెట్
క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందినప్పటికీ.. సరిపడు నిధులు లేక గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాంపుడ్యూటీ సహా మైనింగ్ రాయాల్టీ ఫీజులను పంచాయతీలకే అప్పగించాలని, ప్రభుత్వం రంగారెడ్డిజిల్లాకు బకాయిపడిన రూ.545 కోట్ల మైనింగ్ నిధులను వెంటనే ఆయా పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభు త్వాలు ఇచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు ప్రతి పంచాయతీకి రూ.50 లక్షల బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్తా, ఉపాధ్యక్షుడు పి.అశోక్‌రావు, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు శ్రీశైలం, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, సర్పంచుల సంఘం ప్రతినిధులు కమలాకర్‌గౌడ్, ఎం.వెంకట్, ర్యాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Road Safety Week: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో.. విద్యార్థులకు అవగాహన ర్యాలీ!

