Mulugu Municipality: ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచిన ములుగులో తొలిసారిగా మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజెపి కూడా ప్రతిపక్ష (Brs) బీఆర్ఎస్ కు సపోర్టు చేసే అవకాశాలు ఉండడంతో ఆ జిల్లాలో రాజకీయ హంగామా నెలకొంది. గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ములుగు ఇప్పుడు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న బండారుపల్లి, జీవంతరావుపల్లి, పాల్ సాబ్ పల్లి, మాధవరావు పల్లి ములుగు మునిసిపాలిటీలో కలిపారు. దీంతో కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులుగా విభజించి ఎన్నికలకు అధికార యంత్రం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా గతంలో భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండేది. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంత వాసుల డిమాండ్ తో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ములుగును కూడా జిల్లాగా ఏర్పాటు చేసింది. ములుగు జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లాగా పేరుగాంచింది. దీంతో అన్ని అవకాశాలు ఏజెన్సీ ప్రాంత వాసులకే వర్తిస్తుండడంతో అక్కడ అధికంగా ఉన్న ఎస్సీ కేటగిరికి సంబంధించిన వారికి ములుగు చైర్మన్ పీఠం రిజర్వ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా చర్చ విస్తృతంగా జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచి 25 మంది, బీఆర్ఎస్, బీజెపి కలయికలో 20 మంది
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 25 మంది ఆశావహులు మున్సిపల్ చైర్మన్ పీఠంపై అధిష్టించాలని తహతహలాడుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో పరిపాలిస్తున్న బిజెపి పార్టీతో కలిపి 20 మంది ములుగు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలని ఉత్సాహపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రిజర్వేషన్లు ఖరారు కాకపోయినప్పటికీ ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. లిఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధులవుతున్నారు.
Also Read: Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!
ములుగు మునిసిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశం
తొలిసారిగా మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా ములుగు చైర్మన్ పీఠం ఎస్సీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉందని ఆ జిల్లాలో రాజకీయ నాయకుల మధ్య విస్తృత చర్చ జరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాకు అన్ని విధాలుగా ఆదివాసీలకు అన్ని రకాల హక్కులను కల్పిస్తున్న నేపథ్యంలో ములుగు చైర్మన్ పీఠం ఎస్సీలకు రిజర్వ్ చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇప్పటివరకు అన్ని కులాలకు సంబంధించిన వారు ములుగు చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తమ రాజకీయ గాడ్ ఫాదర్ల వద్దకు వెళ్లి ఫైరవీలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ములుగు చైర్మన్ పీఠం ఎస్సీలకు రిజర్వేషన్ అయితే ఎవర్ని నిలబెట్టాలి. ఆర్థిక బలం, అంగ బలం ఉన్న వారిని వెతుక్కోవడం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రాజకీయంగా అన్ని రకాల హంగులు ఉన్నవారికి, అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం పార్టీ కోసం కష్టపడిన యువ రక్తానికి చోటు కల్పించాలని ఆలోచనలో ఉన్నట్లుగా కూడా చర్చ జరుగుతుండడం విశేషం. మరి త్వరలోనే రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి చైర్మన్ పీఠం కోసం పోటీపడే వారి అదృష్టం బయటపడే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!

