GHMC: జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత పెరిగిన విస్తీర్ణం పునర్విభజన, వార్డుల డీలిమిటేషన్, జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియలో సర్కార్ స్పీడ్‌ను గమనిస్తే, జీహెచ్ఎంసీలోని ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం ముగియనున్న ఫిబ్రవరి10 తర్వాత ఆరు నెలల్లోనే, లేక అంతకు ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు అంచనా వేయవచ్చు. పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పరిశీలించి, రిమార్క్స్ సమర్పించాలని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి మంత్రివర్గం ఆమోదించిన ప్రియాంబుల్ ప్రతిపాదన వచ్చిన కేవలం 37 రోజుల్లోనే అధికారులు విలీనం, పునర్విభజన, జోన్లు, సర్కిళ్ల పునర్ వ్యవస్థీకరణతో పాటు కావాల్సిన సిబ్బందిని కూడా నియమించుకుని ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు లేకుండా పౌర సేవల నిర్వహణ కూడా మొదలు పెట్టారు.
ఆమోదం లేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
పాలక మండలి అధికారంలో ఉన్న స్థానిక సంస్థలపై పాలక మండలి ఆమోదం లేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్న నిబంధన ఉన్నందున వచ్చే నెల 10వ తేదీన పాలక మండలి గడువు ముగిసిన వెంటనే పెరిగిన జీహెచ్ఎంసీ విస్తీర్ణం 2 వేల 53 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణాన్ని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు దాదాపు రంగం సిద్దమైనట్లు సమాచారం. పెరిగిన విస్తీర్ణాన్ని 300 వార్డులుగా, 12 జోన్లు, 60 సర్కిళ్లుగా అధికారులు చేసిన పునర్విభజనకు అసెంబ్లీ చట్టబద్దమైన ముద్ర వేసింది. ఇందుకు మున్సిపల్ చట్టంలో కావాల్సిన సవరణ బిల్లును కూడా అసెంబ్లీ ఆమోదించడంతో ఇక వార్డుల డీలిమిటేషన్‌పై మార్పులకు తెరపడినట్టే. ప్రస్తుత విస్తీర్ణాన్ని కూడా మూడు కార్పొరేషన్లుగా విభజించి, ప్రకటించేందుకు అధికారులు సిద్దంగా ఉన్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. ఇకపై ఫుడ్ సేఫ్టీ, ఇమ్యునైజేషన్‌పై ప్రత్యేక నిఘా..!
డీలిమిటేషన్ చేసిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారు
మూడు కార్పొరేషన్లుగా అధికారులు చేసిన కసరత్తు ప్రకారం గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా రూపొందించారు. ఫిబ్రవరి 10 తర్వాత అధికారులు మూడు గ్రేటర్ కార్పొరేషన్ల ప్రతిపాదనలను సర్కారుకు పంపనున్నట్లు సమాచారం. అధికారులు పంపిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోద ముద్ర వేసే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఏమైనా మార్పులు చేయాలని భావిస్తే అది కేవలం కార్పొరేషన్ల పేర్ల మార్పు వరకు పరిమితం కావొచ్చునని అధికార వర్గాల సమాచారం. ఇటీవలే డీలిమిటేషన్ చేసిన మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి అధికారులు నివేదికను సిద్దం చేసినట్లు తెలిసింది.
ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్దం
వీలైనంత త్వరగా మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్దంగా ఉన్నట్లు, పాలక మండలి అధికార గడువు ముగింపే ఆలస్యమని అధికార వర్గాల సమాచారం. మూడు కార్పొరేషన్లు చేయాలని గత నెల 25న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు, ఇందులో భాగంగానే గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు అర్హులైన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను ప్రతి మూడు జోన్లకు ఒకరు చొప్పున, ఆరు జోన్లకు అదనపు కమిషనర్లను నియమించిన సర్కార్ ఫిబ్రవరి 10 తర్వాత వారినే కమిషనర్లుగా నియమిస్తూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కర్ణన్‌ను కొనసాగిస్తూ కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.
వీలైనంత త్వరగా కార్పొరేషన్ల ఎన్నికలు?
జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ముగియగానే ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. పాలక మండలి ఉంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులొచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే రాష్ట్రంలోని 117 మున్సిపాల్టీలు, ఆరు కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతుండగా, జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి పాలక మండలి ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలన్న యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 10 తర్వాత నెలాఖరు లోపు మూడు కార్పొరేషన్లను ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సర్కారు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో ఫిబ్రవరి మాసంలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఏప్రిల్ నెలాఖరులో గానీ, మే నెల మొదటి వారంలో గానీ మూడు గ్రేటర్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.
Also Read: GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు

