Seethakka: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రాం జీ చట్టం పేదలకు వ్యతిరేకమని, ఈ చట్టాన్ని సభ్యులంతా వ్యతిరేకించాలని మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టినందుకు ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో మహ్మాతా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్ప కాలిక చర్చను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహాత్మాగాంధీ పేరును మార్చడం సరికాదని, తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం వేయకుండా గతంలో మాదిరిగా 100 శాతం నిధులను కేంద్రమే భరించాలన్నారు.
40% నిధులు రాష్ట్రాలు వెచ్చించాలి
కొత్త చట్టంలో ఉన్న పంట సీజన్ లో 60 రోజుల ఉపాధి హలిడే విధానాన్ని విరమించుకోవాలని కోరారు. పీఎం గతిశక్తి కార్యక్రమానికి ఉపాధి హామీని ముడి పెట్టకుండా.. గతంలో మాదిరిగా గ్రామసభల్లో గ్రామానికి అవసరమైన పనులను కొనసాగించాలని పేర్కొన్నారు. వీబీ జీ రాం జీ చట్టాన్ని అమలు చేస్తే తెలంగాణపై అదనంగా ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల భారం పడనున్నదని ఆవేదన వ్యక్తం చ చేశారు. కొత్త చట్టంలో ఆచరణ సాధ్యంకానిదని, పైకి 125 రోజుల ఉపాధి హామీ అని కేంద్రం చెబుతున్నా కేంద్రం ఇచ్చేది 75 రోజులేనని పేర్కొన్నారు. 40% నిధులు రాష్ట్రాలు వెచ్చించాలని, ఏ పని చేయాలో కేంద్రమే అనుమతులు ఇవ్వనున్నదని చెప్పారు.
Also Read: Minister Seethakka: గ్రామాల అభివృద్ధికి.. సీఎం రేవంత్ కృషి.. మంత్రి సీతక్క
బడ్జెట్ లో 4 శాతం నిధులు ఉపాధి హామీ
కేంద్ర ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే.. మా దయతో మీ గంజి మీరు తాగండి అన్నట్లు గా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్ లో ఉపాధి హామీకి కోతలు విధిస్తుందని పేర్కొన్నారు. యూపీఏ హయాం లో బడ్జెట్ లో 4 శాతం నిధులు ఉపాధి హామీ కి వెచ్చించిందని గుర్తుచేశారు. కానిప్పుడు కేవలం 1.37 శాతం నిధులు మాత్రమే కేటాయించిందన్నారు. కోట్ల మంది కూలీల ఆకలి తీర్చిన మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. సాధారణ ఆదివాసీ రైతు కూలిబిడ్డగా ఉన్న నేను ఈ రోజు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నానని, అక్కడ స్పీకర్ గా దళితబిడ్డ ఉన్నారంటే అంబేద్కర్ చలువేనని పేర్కొన్నారు.
దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 100 శాతం వేతన అంశానికి 75 శాతం మెటిరియల్ కు కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుందని, ఈ విధానాన్ని 60:40 కి మార్చిందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. గతేడాది కేటాయించిన 12. 5 కోట్ల పనిదినాలకు లెక్క వేస్తే ఉపాధిచట్టం కింద రాష్ట్ర వాటా రూ. 532.13 కోట్లు కాగా వీబీ జీ రామ్ జీ కింద రాష్ట్రవాటా రూ.2,320.10 కోట్లు ఉంటుందని, అంటే రూ.1787.97 కోట్ల అదనపు ఆర్థిక భారం అవుతుందని చెప్పారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ హక్కుల ఆధారిత రూపకల్పనలో డిమాండ్ ఆధారిత విధానం కలిగి పని హక్కు ను న్యాయబద్ధంగా అమలు చేస్తున్నదన్నారు. పారదర్శకత, జవాబుదారీతనానికి, ఉత్పాదక, మన్నికైన ఆస్తులను కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.
ఆనాడు గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ శక్తులే
పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిల్లో వివిధ అవార్డులు పొందాయన్నారు. ఆనాడు గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ శక్తులేనని, నేడు ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీ పేరు తొలగించింది కూడా ఆర్ఎస్ ఎస్ శక్తులేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గాంధీని బీజేపీ నేతలు నిండు సభలో అవమానిస్తున్నరని ఫైర్ అయ్యారు. గాంధీని బీజేపీ నేతలు నిండు సభలో అవమానించడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల పొట్టకొట్టేందుకే కొత్త నిబంధనలు పెట్టిందని చెప్పారు. 40 శాతం నిధులు రాష్ట్రాలు భరించాలని కేంద్రం చెప్తుతుందని, అలాంటప్పుడు కేంద్రం పెత్తనం ఏంటి అని నిలదీశారు. కేంద్రం తప్పించుకుని రాష్ట్రాలపై భారం వేసిందన్నారు.
Also Read: Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్‌లకు తగిన గౌరవం దక్కుతుంది : మంత్రి సీతక్క

