India Bullet Train: భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ వెంబడి దశలవారీగా సేవలను ప్రారంభించడంతో, 2027 ఆగస్టు 15న కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ “ బుల్లెట్ రైలు 2027, ఆగస్టు 15న సిద్ధమవుతుంది. మొదట సూరత్ నుండి బిలిమోరా వరకు మొదటి సెక్షన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత, వాపి నుండి సూరత్ వరకు ప్రారంభమవుతుంది. తర్వాత వాపి నుండి అహ్మదాబాద్ వరకు, ఆ తర్వాత థానే నుండి అహ్మదాబాద్ వరకు, చివరగా ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రారంభమవుతుంది.” అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అహ్మదాబాద్‌లోని సబర్మతి, ముంబై మధ్య నిర్మిస్తున్న 508 కిలోమీటర్ల ఈ హై-స్పీడ్ రైల్ కారిడార్, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ల కోసం రూపొందించబడింది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, బుల్లెట్ రైలు మొత్తం దూరాన్ని 2 గంటల 17 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
ఈ ప్రాజెక్టుకు 2017లో శంకుస్థాపన జరిగింది. వాస్తవానికి డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, భూసేకరణ, ఇతర సవాళ్ల కారణంగా గడువును పొడిగించారు. ప్రారంభ ప్రయాణంపై తాజా సమాచారం అందిస్తూ, వైష్ణవ్ ఇలా అన్నారు, “ బుల్లెట్ రైలు తన ప్రారంభ ప్రయాణంలో, ఇప్పుడు 2027 ఆగస్టులో సూరత్, వాపి మధ్య 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అంతకుముందు, ఇదే గడువులోగా సూరత్, బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గంలో ప్రారంభ ప్రయాణాన్ని ప్లాన్ చేశారు.”
Also Read: SP Sudhir Ramnath Kekan: గట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు: ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్
పూర్తి కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణ సమయం ఆదా అయ్యే ప్రయోజనాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు “ బుల్లెట్ రైలు నాలుగు స్టేషన్లలో ఆగుతూ ముంబై, అహ్మదాబాద్ మధ్య దూరాన్ని 1 గంట 58 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. అయితే, ఇది మొత్తం 12 స్టేషన్లలో ఆగితే, మొత్తం దూరాన్ని 2 గంటల 17 నిమిషాల్లో పూర్తి చేస్తుంది ” అని మంత్రి తెలిపారు.
Also Read: Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్
నవంబర్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను సందర్శించి, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పనుల పురోగతిని సమీక్షించారు. ఇంజనీర్లు, కార్మికులతో మాట్లాడి ఆ సంభాషణలో నిర్మాణ పనులు ఎప్పుడు ముగుస్తాయో ఆ తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సజావుగా సాగుతోందని బృందం ఆయనకు హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అనుభవాలు ఒక “బ్లూ బుక్” లో నమోదు చేసి సమగ్రంగా క్రోడీకరించాలని ప్రధానమంత్రి తెలిపారు. అలా చేయడం వల్ల భవిష్యత్తులో అదే విధమైన ప్రయోగాలు పునరావృతం కాకుండా ఉండి, దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టులను పెద్ద స్థాయిలో అమలు చేసే దిశగా భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.

