BRS: గులాబీ పార్టీకి 2025 నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది కలిసి వస్తుందని పార్టీ గాడిన పడుతుందని ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీ కమిటీలతో క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుందని భావించింది. కానీ, ఓ వైపు కేసులు, మరో వైపు విచారణలతో ముఖ్య నేతలు ఎదుర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనపై గోష్ కమిషన్ ఎదుట కేసీఆర్(KCR), హరీశ్ రావు(Harish Rao) హాజరయ్యారు. ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈ ఘటనలు పార్టీ క్యాడర్‌లో నైరాశ్యం నింపింది. కానీ, ఏడాది చివర్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు మాత్రం కొంత పార్టీకి ఊరట ఇచ్చాయి. 2025 ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఆశించిన మేర కలిసి రాలేదు. ఒవైపు కేసులు, మరో వైపు విచారణలు ముఖ్య నేతలు ఎదుర్కొన్నారు. ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ ఏ- వన్‌గా ఉన్నారు. మళ్లీ ఇదే నెల16న కేటీఆర్ ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. తిరిగి జూన్ 16న ఏసీబీ విచారణకు మరోసారి హాజరయ్యారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి19న తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్(BRS) విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఇక మర్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఇక పార్టీ ఆవిర్భావం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రాలేదు. రజతోత్సవ సభ తర్వాత పార్టీ క్యాడర్‌లో జోష్ వచ్చింది.
తెరపైకి అంతర్గత విభేదాలు
అంతా ఓకే అనుకునే సమయానికి పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగానే మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు టార్గెట్‌గా కవిత కామెంట్స్ చేశారు. తన తండ్రి కేసీఆర్(KCR) మంచివారని, కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. దీంతో పాటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాలు ఆమె ప్రస్తావించారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. వరంగల్ సభ తర్వాత రైతాంగ సమస్యలపై రైతు దీక్షలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. కేటీఆర్ రైతు దీక్షల్లో పాల్గొన్నారు. పార్టీ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఇక కమిషన్ విచారణకు కేసీఆర్ జూన్ 11న హాజరయ్యారు. హరీశ్ జూన్ 9వ తేదీన విచారణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అంశాన్ని సీబీఐకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో మూడు నెలల్లో 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక సుప్రీంకోర్టు గడువు దాటినా చర్యలు తీసుకోలేదని కేటీఆర్ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read: Year Ender 2025: గుడ్ బై 2025.. ఈ ఏడాది జరిగిన ముఖ్య సంఘటనలపై స్వేచ్ఛ స్పెషల్..!
ఈ ఏడాదిని ఓటమితో ముగించింది
ఈ ఏడాదిని ఓటమితో బీఆర్ఎస్ ముగించింది. జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Magannti Gopinadh) మరణించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అందరికంటే ముందు సెప్టెంబర్ 26వ తేదీన గులాబీ పార్టీ అధిష్టానం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. నవంబర్ 11న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. నవంబర్ 14న ఫలితాలు వచ్చాయి. ఇక సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని అనుకున్న స్థానంలో ఓటమి బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచింది. ఇక, 2025వ సంవత్సరంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పినా సాధ్యం కాలేదు. పార్టీ ప్లీనరీని, నూతన అధ్యక్షుడి నియామకంతో పాటు పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారని భావించిన క్యాడర్ అసంతృప్తికి గురైంది. తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకునే విధంగా కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజా సమస్యలపై పోరాడుతానని, రెండేళ్లు ఓపిక పట్టానని ఇక తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో కొంత సంతృప్తి
ఇక ఏడాది చివరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు గులాబీ పార్టీకి సంతృప్తి ఇచ్చాయి. మూడు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమకు దాదాపు 40 శాతం సర్పంచ్ స్థానాలు వచ్చాయని బీఆర్ఎస్ అంటోంది. దీంతోపాటు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా భూముల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేశారు. ఏడాది చివర్లో గులాబీ బాస్ కేసీఆర్ బయటకు రావడం క్యాడర్‌లో జోష్ నింపింది. ఇక కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే అంశంలో కార్యాచరణ తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చే ఏడాది భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 2025లో గులాబీ పార్టీకి కలిసి రాలేదని రాజకీయంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీలు వేస్తారని పార్టీ నేతలు ఆశించారు. తమకు పార్టీ గుర్తింపు ఇస్తుందని, కమిటీల్లో ప్రాధాన్యత ఇస్తుందని భావించారు. కానీ, ఆ దిశగా పార్టీ చర్యలు చేపట్టలేదు. బలోపేతంపై చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ కమిటీలు కూడా వేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక 2026లో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కలిసొస్తుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్ ఫస్ట్ లుక్!

