Gig Workers Strike: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో బ్లింకిట్‌కు చెందిన ఓ డెలివరీ ఉద్యోగిపై జరిగిన అమానుష దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నపాటి రోడ్డు ఘటన అనంతరం కారులో వచ్చిన వ్యక్తులు డెలివరీ బాయ్‌ను దారుణంగా కొట్టిన దృశ్యాలు వీడియోలో బయటపడగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనను అక్కడున్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. పగటి వేళ బహిరంగంగా జరిగిన ఈ దాడిలో, కారులో ఉన్న వ్యక్తులు డెలివరీ ఉద్యోగిపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భుజాలపై బ్లింకిట్ బ్యాగ్ ఉన్న డెలివరీ బాయ్‌ను ఓ వ్యక్తి బలవంతంగా లాగుతూ తీసుకెళ్లగా, అతని బైక్ రోడ్డుపై పడివున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి.
కారు యజమాని డెలివరీ ఉద్యోగిని తన వాహనం దగ్గర నుంచి లాగి నేలకూల్చి, చెంపదెబ్బలు కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇదే సమయంలో మరో వ్యక్తి చేతిలో కర్రతో అక్కడికి వచ్చి, డెలివరీ బాయ్‌ను కొట్టడంతో పరిస్థితి మరింత తీవ్రతరం చేసింది. తీవ్రంగా గాయపడుతున్న డెలివరీ ఉద్యోగిని చూసిన స్థానికులు చివరకు జోక్యం చేసుకుని దాడిని ఆపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, చిన్నపాటి రోడ్డు ఢీకొట్టు ఘటన తర్వాతే ఈ గొడవ చోటుచేసుకుందని పేర్కొంది. ఈ వీడియోను ‘X’ (ట్విట్టర్) వేదికగా “రోడ్ రేజ్ కలేష్: చిన్న ప్రమాదం కారణంగా బ్లింకిట్ డెలివరీ బాయ్‌పై కార్ డ్రైవర్, సహ ప్రయాణికుడు దాడి” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ఈ వీడియో వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న చేపట్టనున్న సమ్మె నేపథ్యంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. డెలివరీ ఉద్యోగుల యూనియన్లు “యాప్ బంద్” పేరుతో దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
గిగ్ వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్, జాతీయ సమన్వయకర్త నిర్మల్ గోరానా కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మండావియాకు లేఖ రాసి 15 కీలక డిమాండ్ల జాబితాను సమర్పించారు.
ఆ డిమాండ్లలో ప్రధానంగా
– 10, 20 నిమిషాల డెలివరీ సేవల ఒత్తిడిని నిలిపివేయడం
– జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే వారికి కిలోమీటర్‌కు కనీసం రూ.20 చెల్లింపు
– మహిళా డెలివరీ ఉద్యోగులకు ఎమర్జెన్సీ లీవ్, పూర్తి స్థాయి మాతృత్వ రక్షణ
– కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడం, శిక్షాత్మక రేటింగ్ సిస్టమ్‌లకు ముగింపు వంటి డిమాండ్లు ఉన్నాయి.
అలాగే, నెలకు కనీసం రూ.40,000 హామీ ఆదాయం, పీక్ అవర్స్, స్లాట్ సిస్టమ్, వీకెండ్ పని పరిమితుల తొలగింపు, కస్టమర్ క్యాన్సిలేషన్‌ల వల్ల కలిగే నష్టాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను కూడా యూనియన్ ముందుంచింది. ఈ నేపథ్యంలో, నాగ్‌పూర్ ఘటన గిగ్ వర్కర్ల భద్రత, హక్కులపై మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది.

