Battle of Galwan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) చిత్రం వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. తమ దేశంలో కళలకు పూర్తి స్వేచ్ఛ ఉందని.. సినిమాటిక్ ఫ్రీడంతో చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలకు హక్కు ఉందని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.
‘డౌట్ ఉంటే.. రక్షణ శాఖను అడగండి’
జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన కేంద్రం ప్రభుత్వ ప్రతినిధి.. చైనాకు చురకలు అంటించారు. భారత్.. భావ ప్రకటన స్వేచ్ఛ కలిగిన దేశమని ఆయన స్పష్టం చేశారు. ఈ స్వేచ్ఛ కళాత్మక రంగాలకు చెందిన సినిమాలకు సైతం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాపై ఎవరికైనా సందేహాలు ఉంటే.. వారు భారత రక్షణమంత్రిత్వశాఖను సంప్రదించి స్పష్టత తీసుకోవచ్చని సూచించారు. అయితే ఈ సినిమాకు, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
చైనా ఆరోపణలు ఏంటంటే?
చైనాకు చెందిన ప్రముఖ పత్రిక గ్లోబల్ టైమ్స్.. సల్మాన్ నటించిన ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) తన అక్కసు వెళ్లగక్కింది. 2020 జూన్‌లో జరిగిన ఘర్షణల తాలూకు ఘటనలను వాస్తవాలకు అనుగుణంగా చూపించలేదని ఆరోపించింది. ‘బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వినోదం, భావోద్వేగాలతో కూడిన అంశాలను తెరకెక్కిస్తాయి. అయితే ఇలాంటి సినిమాలు చరిత్రను మార్చలేదు. చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించాలనే PLA సంకల్పాన్ని దెబ్బతీయలేవు’ అని కథనాన్ని ప్రచురించింది. ఇదే ఆర్టికల్ లో గల్వాన్ లోయ ప్రాంతం చైనా భూభాగంలో ఉన్నట్లు తప్పుడు రాతలు రాసింది.
Also Read: IRCTC New Feature: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. ఈ తప్పు చేయకండి!
సల్మాన్ మూవీ విషయానికి వస్తే..
2020లో తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన భారత్ – చైనా సైనికుల ఘర్షణపై సల్మాన్ ఖాన్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ బిహార్ రెజిమెంట్ కు చెందిన కల్నల్ బిక్కుమల్లా సంతోష్ బాబు పాత్రను పోషించారు. చొరబాటుకు యత్నించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలు విడిచిన ఆర్మీ జవాన్ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుండటంపై దేశవ్యాప్తంగా ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా చైనాతో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు విడిచినట్లు కేంద్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే తొలుత తమ సైనికులు ఎవరూ చనిపోలేదని చైనా పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత నలుగురు మాత్రమే చనిపోయారని ప్రకటించుకుంది. అయితే వాస్తవ మరణాలను చైనా భారీగా తగ్గించి చూపించిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

