Self Care Tips: నేటి ఊరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. బాధ్యతలు, పనిభారం, భావోద్వేగ ఒత్తిళ్లు ఒకేసారి పెరిగినప్పుడు మనసు తట్టుకోలేని స్థితికి చేరుతుంది. ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులను కూడా సరిగా చేయలేము. మన ఆలోచనల సామర్థ్యాన్ని మించి పోయినప్పుడు ఈ ఒత్తిడి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మన చుట్టు పక్కల పరిసరాలు శారీరకంగానూ, భావోద్వేగంగానూ.. మన మానసిక స్థితిపై పెద్ద ప్రభావం చూపుతాయి.
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెల్ఫ్-కేర్ అంటే ఒక్కసారిగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడం కాదు. చిన్న చిన్న పనులతో మనసుకు భద్రత, ప్రశాంతత కలిగించడమే నిజమైన సెల్ఫ్-కేర్. ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ చిట్కాలను చదివి పాటించండి.
1. లోతుగా శ్వాస తీసుకోవడం
నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం నర్వస్ సిస్టమ్‌ను శాంతింపజేసే సరైన మార్గం. నాలుగు సెకన్లు శ్వాస తీసుకుని, నాలుగు సెకన్లు ఆపి, ఆరు సెకన్లు విడిచేలా చేయడం వల్ల శరీరానికి భద్రతా సంకేతం అందుతుంది. కేవలం రెండు నిమిషాలు ఇలా చేయడం కూడా ఒత్తిడిని తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు.
2. పరిసరాలను మార్చుకోవడం
ఒక చిన్న స్థల మార్పు కూడా మనసు స్థితిని వెంటనే మార్చగలదు. బయటకు వెళ్లడం, కిటికీ తెరవడం, నిశ్శబ్దమైన గదికి మారడం లేదా వర్క్ డెస్క్‌ను సర్దుకోవడం వంటివి ఉపశమనాన్ని ఇస్తాయి. తాజా గాలి, సహజ వెలుతురు మనసుకు స్పష్టతను తీసుకొస్తాయి.
3. శబ్దాలను తగ్గించుకోండి
టీవీ, సోషల్ మీడియా, ట్రాఫిక్ శబ్దాలు వంటి నిరంతర నేపథ్య శబ్దాలు మెదడును అతిగా ఉత్తేజపరుస్తాయి. అవసరం లేని శబ్దాలను ఆపేయడం, నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్లు వాడడం లేదా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం వలన ఆలోచనలు అదుపులోకి వస్తాయి.
4. చిరాకు తెప్పించే వ్యక్తులకు దూరంగా ఉండండి
ప్రతి ఒక్కరికీ ప్రతీ సమయంలో మన శక్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని పరస్పర సంబంధాలు మనల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తే, కొంతకాలం దూరంగా ఉండటం తప్పు కాదని నిపుణులు సూచిస్తున్నారు. భావోద్వేగ శక్తిని కాపాడుకోవడం స్వార్థం కాదు, అవసరం.
5. వ్యాయామం
మరి విపరీతమైన తీవ్ర వ్యాయామం అవసరం లేదు. నడక, స్ట్రెచింగ్, యోగా వంటివి చాలు. ఇవి శరీరంలో నిలిచిపోయిన ఒత్తిడిని విడుదల చేస్తాయి. ఆ తర్వాత రక్త ప్రసరణను మెరుగుపరచి, స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది.
6. ఇంట్లో ఉన్న వస్తువులు క్లీన్ చేయడం
చుట్టూ ఉన్న గందరగోళం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఒక చిన్న ప్రదేశాన్ని లేదా టేబుల్, బ్యాగ్ లేదా మొబైల్ స్క్రీన్, శుభ్రం చేయడంతో ఒత్తిడి తగ్గుతుంది. చిన్న పని పూర్తవ్వడంతో మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది.

