Apple AirPods : యాపిల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ అయిన ఎయిర్‌పాడ్స్‌కి ఎప్పటినుంచో ఉన్న తెలుపు రంగు గుర్తింపు త్వరలో మారే అవకాశముందా? తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని లీక్ ఫోటోలు ఈ ప్రశ్నకు కొత్త చర్చను తెరలేపాయి. పింక్, యెల్లో రంగుల్లో ఉన్న ఎయిర్‌పాడ్స్ ప్రోటోటైప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రారంభ దశలోనే రంగుల ప్రయోగాలు
లీకర్ కోసుటామి (Kosutami) షేర్ చేసిన ఫోటోల ప్రకారం, ఇవి యాపిల్ మొదటి తరం ఎయిర్‌పాడ్స్‌కు సంబంధించిన ప్రారంభ ప్రోటోటైప్స్‌గా భావిస్తున్నారు. 2016లో అధికారికంగా విడుదలైన ఎయిర్‌పాడ్స్‌కు ముందు యాపిల్ అంతర్గతంగా ఈ రంగుల మోడళ్లను పరీక్షించినట్టు తెలుస్తోంది. ఈ ప్రోటోటైప్స్ నార్మల్ గా కాకుండా, దాదాపు ప్రొడక్షన్ స్థాయిలో ఉన్నట్టు కనిపించడం విశేషం. అంటే యాపిల్ అప్పట్లో రంగుల ఎయిర్‌పాడ్స్‌ను సీరియస్‌గా పరిశీలించిన అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
iPhone 5c తరహా డిజైన్ ఆలోచన?
ఈ రంగుల ఎంపికలు యాపిల్ గతంలో అనుసరించిన డిజైన్ వ్యూహానికి దగ్గరగా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా iPhone 5c లాంటి మోడళ్లలో యాపిల్ యువతను ఆకర్షించేందుకు బోల్డ్ కలర్స్‌ను ఉపయోగించింది. అదే ఆలోచనను ఎయిర్‌పాడ్స్‌కూ కూడా ఉపయోగించాలని ప్రయత్నం జరిగినట్టు లీకులు సూచిస్తున్నాయి. ఇక 2023లోనూ ఇదే లీకర్, iPhone 7 సిరీస్‌కు సరిపోయేలా పింక్, పర్పుల్, బ్లాక్, రెడ్ వంటి రంగుల్లో ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్ పరీక్షించిందని వెల్లడించారు. అయితే అవి కూడా మార్కెట్‌లోకి రాలేదు.
ఇప్పటికీ తెలుపు రంగుకే పరిమితం
ప్రస్తుతం యాపిల్ విక్రయిస్తున్న సాధారణ ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ ప్రో వైట్ కలర్‌లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే యాపిల్ ఆడియో లైనప్‌లో ఒక్క మినహాయింపు AirPods Max మాత్రమే. అవి అనేక రంగుల్లో విడుదలై, తర్వాత కొత్త ఫినిష్‌లతో అప్డేట్ కూడా అయ్యాయి.
భవిష్యత్తులో మార్పు ఉంటుందా?
ఈ రంగుల ప్రోటోటైప్స్ మళ్లీ వెలుగులోకి రావడం ద్వారా, యాపిల్ అంతర్గతంగా ఎన్నో డిజైన్ ప్రయోగాలు చేసినప్పటికీ, వినియోగదారులకు మాత్రం సురక్షితమైన, ఏకరీతి లుక్‌ను ఎంచుకున్నట్టు స్పష్టమవుతోంది.ప్రస్తుతం రంగుల ఎయిర్‌పాడ్స్‌ను విడుదల చేయాలన్న యాపిల్ యోచనపై అధికారిక ధృవీకరణ లేదు. అయినప్పటికీ, ఈ లీకులు యాపిల్ ఎప్పుడో ఒకప్పుడు ఎయిర్‌పాడ్స్ రంగుల ప్రపంచాన్ని విస్తరించాలనుకున్నదానికి స్పష్టమైన ఆధారంగా నిలుస్తున్నాయి. ఆ ఆలోచన భవిష్యత్తులో నిజమవుతుందా అన్నది చూడాల్సిందే.

