Open AI: కృత్రిమ మేధ (AI) వినియోగం, మానసిక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చకు దారితీసేలా OpenAI సంస్థపై కొత్త కేసు దాఖలైంది. 16 ఏళ్ల టీనేజర్ ఆడమ్ రేన్ మృతి కేసులో, అతని కుటుంబం చాట్‌జీపీటీ పాత్రపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది.
నెలల పాటు చాట్‌జీపీటీతో ఆడమ్ చేసిన ఆన్‌లైన్ సంభాషణల్లో ఆత్మహత్యకు సంబంధించిన అంశాలు పలుమార్లు ప్రస్తావనకు వచ్చాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో కూడా చాట్‌బాట్ సరైన భద్రతా హెచ్చరికలు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు.
విషాదానికి దారి తీసిన సంభాషణలు
ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిస్థితి తీవ్రంగా మారిందని కేసులో పేర్కొన్నారు. ఆడమ్ ఒక ఫోటోను చాట్‌జీపీటీకి పంపి, “ ఇలా చేస్తే మనిషి ప్రాణాలు పోతాయా?” అని ప్రశ్నించినట్లు ఆరోపణలు చేసారు. దీనికి చాట్‌బాట్ ఇచ్చిన సమాధానం ప్రమాదకరంగా ఉందని కుటుంబం వాదిస్తోంది. ఆ రోజు కొన్ని గంటల తర్వాత, కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో ఆడమ్ మృతదేహాన్ని అతని తల్లి గుర్తించారు. ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తల్లిదండ్రుల ఆరోపణలు
ఆడమ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన అకాల మరణం కేసులో, OpenAI సరైన భద్రతా వ్యవస్థలు అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువతలో చాట్‌బాట్ వాడకం వల్ల మానసికంగా నలిగిపోయే ప్రమాదం ఉందని సంస్థకు తెలిసినా, తగిన నియంత్రణలు పెట్టలేదని వారు చెబుతున్నారు. ఇది OpenAIపై వచ్చిన కేసు కాదని, ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతో మరికొన్ని దావాలు దాఖలైనట్లు తెలుస్తోంది.
OpenAI వివరణ
ఈ ఆరోపణలను ఓపెన్ ఏఐ OpenAI ఖండించింది. చాట్‌జీపీటీ వాడకానికి ముందే ఆడమ్‌లో డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయని సంస్థ పేర్కొంది. అలాగే, అతను భద్రతా నియమాలను దాటవేసి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించాడని తెలిపింది. అంతేకాదు, చాట్‌జీపీటీ ఆడమ్‌ను 100 సార్లకు పైగా హెల్ప్‌లైన్లు, సంక్షోభ సహాయ వనరుల వైపు దారితీసిందని, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులను సంప్రదించమని సూచించిందని OpenAI తెలిపింది. ఈ కేసు టెక్నాలజీ అభివృద్ధి, యువత మానసిక ఆరోగ్యం, AI బాధ్యతలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా AI భద్రతా నిబంధనలను మరింత కఠినంగా చేయాలా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.

