Sandhya Theatre Case: గతేడాది డిసెంబర్ 4న ‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోవడంతో కేసు నమోదవ్వగా, ఆ కేసుకు సంబంధించి శనివారం (డిసెంబర్ 27) నాడు కీలక పరిణామం జరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్న చిక్కడపల్లి పోలీసులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. .ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం 23 మందిపై అభియోగాలు మోపగా, ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా ఉంది. అల్లు అర్జున్ మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది, 8 మంది బౌన్సర్ల పేర్లను కూడా చేర్చారు. సంథ్య థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్‌పై కూడా పోలీసులు అభియోగాలు మోపారు.
థియేటర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగినట్టుగా ఛార్జ్‌షీటులో పోలీసులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడతారని తెలిసి కూడా, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని పేర్కొంది. మరోవైపు, తాను వెళ్తే థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా అల్లు అర్జున్ వెళ్లడంతో అతడిని కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోగా, ఆమె కొడుకు ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ బాలుడు ఇటీవలే కాస్త కోలుకున్నాడు.
కాగా, పుష్ప-2 సినిమా ప్రీ-రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌ను చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో, అతడి బౌన్సర్లు అభిమానులను పక్కకు నెట్టడం తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు మృత్యువుతో పోరాడి బయటపడ్డాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Read Also- Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్
తర్వాత ఏంటి?
పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిశీలించనుంది. పూర్తిగా పరిశీలించి దానిని ఆమోదించిన తర్వాత నిందితులకు సమన్లు జారీ చేస్తుంది. అప్పుడు అల్లు అర్జున్, ఇతర నిందితులు స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం కారణంగానే మరణం సంభవించినట్లు చట్టాల ప్రకారం రుజువైతే, నిందితుల ప్రమేయాన్ని బట్టి కోర్టు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంటుంది. కాగా, ఛార్జ్‌షీటులో నిందితులుగా ఉన్న వ్యక్తులు ఈ అభియోగాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుంది. ఛార్జ్‌షీట్‌పై స్టే కోరడం, లేదా కేసును కొట్టివేయాలంటూ (Quash) పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. తదుపరి, ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూడాలి.
Read Also- Mega Victory song: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

