Hindu Man lynching: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ వ్యక్తి ఇటీవలే దారుణ రీతిలో క్రూరమైన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన సృష్టించిన భయం నుంచి అక్కడి హిందువులు ఇంకా బయటపడకముందే మరో ఘోరం చోటుచేసుకుంది. మరో హిందూ యువకుడు మూకదాడికి బలయ్యాడు. 29 ఏళ్ల అమృత్ మండల్ (Amrit Mandal) అలియాస్ సామ్రాట్‌ను దారుణంగా కొట్టి హతమార్చినట్టుగా (Hindu Man lynching) బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
రాజధాని ఢాకాకు సుమారుగా మూడున్నర గంటల ప్రయాణ దూరంలో ఉన్న రాజ్‌బారి జిల్లాలో , బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా, ‘సామ్రాట్ బాహిని’ అనే నేరగాళ్ల ముఠాకు అమృత్ మండల్ నాయకుడని, ఈ ముఠా వసూళ్లకు పాల్పడుతుంటుందని స్థానికులు అంటున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత అతను దేశం విడిచి పారిపోయాడని, ఇటీవలే తన సొంత గ్రామం హోసేన్‌దంగాకు తిరిగి వచ్చాడని వివరించారు.
Read Also- The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!
బుధవారం రాత్రి తన ముఠా సభ్యులతో కలిసి గ్రామంలోని షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయగా, ఆ కుటుంబ సభ్యులు కేకలు వేశారని, దీంతో గ్రామస్థులంతా ఏకమై సామ్రాట్‌ను పట్టుకుని దౌర్జన్యంగా కొట్టారని సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమృత్ సామ్రాట్ చనిపోగా, మిగతా ముఠా సభ్యులు పారిపోయారని స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని హాస్పిటల్‌కు తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సామ్రాట్ సన్నిహితుడిగా పేరున్న మహమ్మద్ సెలిమ్ అనే వ్యక్తి నుంచి 2 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.
Read Also- Odisha Encounter: మరో భారీ ఎన్‌కౌంటర్.. అగ్రనేత గణేష్ సహా నలుగురు నక్సల్స్ మృత్యువాత
కాగా, బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నాలుగైదు రోజులక్రితం మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ (27) అనే కార్మికుడిపై మూకదాడి చేసి, అత్యంత హేయంగా చంపేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీపు చంద్ర దాస్ దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పాశవిక దాడి చేశారు. దీపు దాస్ సహోద్యోగి దాడికి ప్రేరేపించగా, ఒక సమూహంపై దాడి చేసి చంపడమే కాకుండా, శవాన్ని ఉరితీసి నిప్పు పెట్టారు. అక్కడున్నవారు వీడియోలు తీసి సంతోషించారు. అసలు విషయం ఏమిటంటే, దీపు చంద్రదాస్ దైవదూషణకు పాల్పడినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఫ్యాక్టరీలో పనికి సంబంధించిన వివాదమే ఈ దాడికి కారణమని అధికారులు గుర్తించారు. ఈ షాకింగ్ ఘటనపై భారత్‌తో పాటు పలు చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విచారణాధికారులు ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు.

