AV Ranganath: పతంగుల పండగ సంక్రాంతి నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా ఉన్నందున, ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా పతంగుల పండగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. పండుగ సమీపిస్తున్నందున బుధవారం హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువులను సందర్శించి పలు సూచనలు చేశారు.
చెరువులలోకి నేరుగా మురుగు నీరు చేరకుండా ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు)ల ద్వారా శుద్ధి జలాలు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్టీపీలను ఏర్పాటుచేసిన ప్రాంతంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఇందుకు చెరువు చెంత ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలన్నారు. పార్కుల అభివృద్ధితో పాటు గ్రీనరీని పెంచాలని సూచించారు. ప్రతి చెరువును ఒక పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలన్నారు. వయోవృద్దులు, సీనియర్ సిటిన్లు సేదదీరే విధంగా సిటింగ్ అరెంజే మెంట్స్ తో పాటు నీడ కల్పించాలని, చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్‌లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!
పతంగుల పండుగ ఏర్పాట్లలో సమన్వయంగా పని చేయాలి
పతంగుల పండుగ ఆహ్లాదకర వాతావరణంలో జరిగేందుకు జీహెచ్ఎంసీ, పర్యాటకంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పని చేయాల్సినవసరాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. చెరువుల చెంత భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, తాగు నీటి వసతితో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే చెరువులను సందర్శించేందుకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడకుండా సులభంగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్న పార్కింగ్ సౌకర్యాన్ని కమిషనర్ పరిశీలించారు. చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున, అక్కడ దుమ్ము, దూళి ఎగరకుండా నీళ్లు చిలకరించాలన్నారు. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రూపొందుతున్నందున చెరువుల్లో నీటిని నింపేందుకు ఎస్టీపీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీ నది ప్రక్షాళనను ప్రభుత్వం చేపడుతున్న వేళ చెరువుల మంచినీరు మూసీలో చేరేలా చూడాలన్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్ల నిర్మాణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వర్షపు నీరు సులభంగా చెరువులోకి చేరేలా ఛానల్స్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
తొలి సారి పండుగకు వేదికలు
మురుగు నీటితో దుర్గంధబరిత వాతావరణంలో ఆక్రమణలకు గురై చెరువు ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను హైడ్రా అభివృద్ధి చేయడంతో సంబురాలకు వేదికలుకానున్నాయి. ఇటీవల బతుకమ్మ ఉత్సవాలకు అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వేదికైతే, నేడు సంక్రాంతి సంబరాలకు బతుకమ్మకుంటతో పాటు మాధాపూర్‌లోని తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా వేదికలుకానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాధ్ వెల్లడించారు. హైడ్రా మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణలో ఉప్పల్ లోని నల్లచెరువు, మాధాపూర్‌లోని సున్నం చెరువు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉండగా, పతంగుల పండుగకు చెరువులు వేదికలు కావటం పట్ల నగర ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆక్రమణలతో కనుమరుగవుతాయని భావించిన చెరువులు రూపురేఖలను మార్చుకుని విస్తరణకు నోచుకున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మొదటి విడత చేపట్టిన ఆరు చెరువులు హైడ్రా పనులు చేపట్టక ముందు 105 ఎకరాలుంటే ఇప్పుడు 180 ఎకరాలకు విస్తీర్ణానికి పెరిగాయన్నారు. నగరం నడిబొడ్డున 75 ఎకరాల ఆక్రమణలు తొలగించి చెరువులను అభివృద్ధి చేయడం సాధారణమైన విషయం కాదనన్న వాదనలు కూడా లేకపోలేవు.
Also Read: AV Ranganath: అక్రమ మార్కింగ్‌లపై చర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు

