MLA Kadiyam Srihari: మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గులాబీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న నిరసనలతో గుబులు పట్టుకుంది. గులాబీ శ్రేణులు వింత వింత నిరసనలు తెలుపుతుండటంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏమి చేయాలో తెలియక పోలీసుల అండతో నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు. కడియం శ్రీహరి బీ ఆర్ ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేయాలని సుప్రింకోర్టుకు వెళ్ళగా, ఇప్పుడ అది స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే కడియం శ్రీహరి ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నేను బీ ఆర్ ఎస్‌లోనే ఉన్నానని తన వివరణ ఇచ్చారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టా? కాంగ్రెస్ పార్టా?
దీంతో టీ ఆర్ ఎస్ శ్రేణులు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో వింత వింత నిరసనలు తెలుపుతున్నారు. మా పార్టీ ఎమ్మెల్యే మాతో ఉండాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ కడియంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టా? కాంగ్రెస్ పార్టా? తేల్చుకోవాలని, బీ ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని బీ ఆర్ ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో కడియం శ్రీహరికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. కడియంపై నిరసనలు రోజు రోజుకు ఉదృతం అవుతున్నాయి. బుధవారం రఘునాథపల్లి పర్యటనక వస్తున్న విషయం తెలుసుకున్న బీ ఆర్ ఎస్ శ్రేణులు హన్మకొండ, హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
Also Read: MLA Kadiyam Srihari: ఆ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై సర్వత్రా ఉత్కంఠ.. ఉప ఎన్నిక ఖాయమా..?
మొన్న ఘన్‌పూర్‌లో
క్రిస్మస్ వేడుకల సందర్భంగా కడియం శ్రీహరిని బీ ఆర్ ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కడియం శ్రీహరి స్పీకర్‌కు బీ ఆర్ ఎస్‌లోనే తాను ఉన్నానని లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని, అందుకే మా ఎమ్మెల్యేకు మద్దుతుగా మా పార్టీలోకి వచ్చి కండువా కప్పుకుని మా కార్యకర్తలతో కలిసి పనిచేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్లెక్సీని ఏర్పాటు చేయడమే కాకుండా, ఆందోళన కూడా చేశారు. చర్చీలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల సందర్భంగా కడియం శ్రీహరికి వ్యతిరేక నినాదాలు చేయడం కలకలం రేగింది. ఇక ప్రతిరోజు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విలేకరుల సమావేశాలు పెట్టి మరి కడియం శ్రీహరిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
ఈరోజు రఘునాథపల్లిలో
రఘునాథపల్లి మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లింగాల ఘన్‌పూర్ మండల పర్యటన ముగించుకుని రఘునాథపల్లికి వస్తుండగా జాతీయ రహాదారిపై కడియంకు వ్యతిరేకంగా బీ ఆర్ ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడియం వ్యతిరేక నినాధాలు చేస్తూ కడియం శ్రీహరి బీ ఆర్ ఎస్‌లో ఉంటే వెంటనే పార్టీ కండువా కప్పుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కడియంకు స్వాగతం పలుకుతున్నట్టుగా బిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలి, లేదంటే బిఆర్ఎస్ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన సమాచారం తెలుసుకున్న స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనకు బి ఆర్ ఎస్ నాయకులు వై. కుమార్ గౌడ్, ముసిపట్ల విజయ్, గూడ కిరణ్ లు నాయకత్వం వహించారు. కడియం శ్రీహరి విషయం తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కులను పంపిణి చేసి వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

