Personal Loan: పర్సనల్ లోన్ ఈఎంఐలు (EMI) చెల్లించకపోతే మొదట రిమైండర్లతో మొదలయ్యే సమస్య, క్రమంగా రికవరీ కాల్స్, లీగల్ నోటీసులు, కఠిన చర్యల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. లోన్ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, చెల్లింపులు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటే రుణ సంస్థలు రికవరీ ప్రక్రియలను ప్రారంభించే హక్కు కలిగి ఉంటాయి.
అయితే, ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా సరైన కమ్యూనికేషన్, ముందస్తు చర్యలు తీసుకుంటే తీవ్రమైన న్యాయ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. ముఖ్యంగా రుణ సంస్థతో స్పష్టంగా మాట్లాడటం, పరిస్థితిని వివరించడం వలన పరిష్కార మార్గాలు దొరకవచ్చు. ఈ నేపథ్యంలో, పర్సనల్ లోన్ డీఫాల్ట్ అయినవారు అనుసరించాల్సిన కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఇవే.
రుణ సంస్థను వెంటనే సంప్రదించాలి
ఈఎంఐ మిస్ అయిన వెంటనే వచ్చే కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను ఎప్పటికీ పట్టించుకోకుండా వదిలేయకూడదు. రికవరీ కాల్స్ వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడుతూ, ఉద్యోగం కోల్పోవడం, వైద్య ఖర్చులు వంటి మీ ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా వివరించాలి. ఇలా చేస్తే రుణ సంస్థతో నమ్మకం పెరిగి, పరిష్కార మార్గాలపై చర్చకు అవకాశం ఉంటుంది.
లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా తాత్కాలిక సడలింపులు కోరాలి
దేశంలోని అనేక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ రీషెడ్యూలింగ్, లోన్ రీస్ట్రక్చరింగ్, టెన్యూర్ ఎక్స్‌టెన్షన్ వంటి సౌకర్యాలను అందిస్తున్నాయి. వీటి నుంచి అకౌంట్‌ను మళ్లీ నార్మల్ చేయవచ్చు. అంతేకాదు, లోన్ నాన్-పర్‌ఫార్మింగ్ ఆసెట్ (NPA) గా మారకుండా కూడా నివారించవచ్చు.
రీపేమెంట్ ప్లాన్ లేదా సెటిల్‌మెంట్‌పై చర్చించాలి
పూర్తి మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేకపోతే, స్ట్రక్చర్డ్ రీపేమెంట్ ప్లాన్ గురించి రుణ సంస్థతో మాట్లాడటం మంచిది. ఇందుకోసం అధికారిక ఈమెయిల్ రాయడం లేదా కస్టమర్ సపోర్ట్ టీమ్‌తో ఫోన్ ద్వారా చర్చించవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, లోన్ ఒప్పందంలోని నిబంధనల మేరకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కు కూడా రుణ సంస్థలు అంగీకరించే అవకాశం ఉంటుంది.
లీగల్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవాలి
పర్సనల్ లోన్ విషయంలో లీగల్ చర్యలు సాధారణంగా పునరావృతంగా ఈఎంఐలు చెల్లించకపోతేనే ప్రారంభమవుతాయి. ముందుగా ఫార్మల్ నోటీసు జారీ చేస్తారు. అలాంటి నోటీసులు వచ్చినప్పుడు భయపడకుండా, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. దీని నుంచి వచ్చే సమస్యను సమర్థంగా ఎదుర్కొని, మరిన్ని లీగల్ చిక్కులు రాకుండా చూసుకోవచ్చు.

