Oppo Reno 15 Series: Oppo భారత మార్కెట్‌లో తన Reno 15 Series 5Gను త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇప్పటికే చైనాలో విడుదల కాగా, ఇప్పుడు భారత్‌లో కూడా లాంచ్ అవుతుందన్న విషయాన్ని కంపెనీ అధికారికంగా రిలీజ్ చేసింది. అయితే ధరలు, ఖచ్చితమైన లాంచ్ తేదీ వంటి కీలక వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఈ సిరీస్ భారత్‌లోకి రాబోతోందని Oppo తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. “Coming Soon” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన టీజర్ వీడియోలో కొత్త Reno 15 ఫోన్ డిజైన్‌ను తొలిసారి చూపించింది. దీంతో త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్లు భారత వినియోగదారుల ముందుకు రానున్నాయనే సంకేతం స్పష్టమైంది.
టీజర్‌లో చూపించిన ఫోన్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో కనిపించింది. బ్లూ వేరియంట్‌లో ఔరోరా లైట్స్‌ను గుర్తు చేసే గ్రేడియంట్ ఫినిష్ ఉండగా, వైట్ వేరియంట్‌లో వెనుక భాగంలో రిబ్బన్ తరహా డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వైట్ కలర్, త్వరలో రాబోతున్న Reno 15 Pro mini మోడల్‌కు సంబంధించినదై ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్ ‘గ్లేసియర్ వైట్’ షేడ్‌లో ప్రత్యేక టెక్స్చర్‌తో వచ్చే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త Reno 15 సిరీస్‌లో కెమెరా మాడ్యూల్‌కు పూర్తిగా కొత్త లుక్ ఇచ్చారు. వెనుక భాగంలో మూడు పెద్ద సర్క్యులర్ లెన్స్ రింగ్స్‌తో పాటు LED ఫ్లాష్ కనిపిస్తోంది. ఈ కెమెరా ఐలాండ్ డిజైన్ పాత Pro-లెవల్ ఐఫోన్ మోడల్స్‌ను తలపించేలా ఉందని టీజర్ చూస్తే తెలుస్తోంది.
లీకుల ప్రకారం, ఈసారి Oppo భారత్‌లో నాలుగు Reno 15 సిరీస్ మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లాని (@passionategeekz) తెలిపిన వివరాల ప్రకారం, Reno 15, Reno 15 Pro, Reno 15c , Reno 15 Pro mini మోడళ్లను ఒకేసారి పరిచయం చేయవచ్చని సమాచారం.
కెమెరా విభాగంలో కూడా ఈ సిరీస్ ప్రత్యేకతను చూపించనుంది. అన్ని మోడళ్లలో AI Portrait Camera ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా Reno 15 Pro mini మోడల్‌లో 200 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరా సెన్సార్ ఉండవచ్చని లీకులు సూచిస్తున్నాయి. దీంతో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ సిరీస్ ఆసక్తికరంగా మారనుంది.

