KCR: తెలంగాణ ఉద్యమ నినాదంలో ‘నీళ్లు’ మొదటి అంశం. కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలన ముగిశాక వెనక్కి తిరిగి చూస్తే దక్షిణ తెలంగాణకు గుండెకాయ వంటి ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం కేవలం ఒక రాజకీయ నినాదంగానే మిగిలిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టును మూడేళ్లలోనే పూర్తి చేశామని చెప్పుకొనే కేసీఆర్(KCR).. పాలమూరు ప్రాజెక్టును పదేళ్లపాటు పాతరేశారని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం పేరిట ‘రంగంలోకి దిగుతా’ అంటూ పొలిటికల్ సర్వైవల్ కోసం తాపత్రపడుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు రంగారెడ్డిపై కేసీఆర్ నిర్లక్ష్యం వహించడం వలనే మూడు జిల్లాల్లో నీటి సమస్య ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు.
కూలిపోయిన కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ లేకపాయే..
కూలిపోయిన కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్‌కు లేకుండాపోయిందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రకటించారు. కానీ పదేళ్ల కాలంలో ఆయన చేసిందల్లా శంకుస్థాపనలు, రీ-డిజైనింగ్ పేరుతో కాలయాపన మాత్రమే. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చులో కనీసం సగం పాలమూరుపై పెట్టి ఉంటే, ఈపాటికి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అయ్యేవి. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఎన్నికల ముందు ఒక పంపు మోటార్ ఆన్ చేసి ‘నీళ్లు ఇచ్చేశాం’ అని ప్రజలను మోసం చేయాలని చూశారనే విమర్శలు ఉన్నాయి.
అనుమతులు తీసుకురావడంలో విఫలం
అధికారంలో ఉన్నన్ని రోజులూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు ఇవ్వడం మొదలుకొని రాష్ట్రపతి ఎన్నికల వరకు బీజేపీకి అవసరమైన ప్రతీచోట కేసీఆర్ మద్దతు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అయితే, ఇంతలా బీజేపీతో అంటకాగినా పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావడంతో నిర్లక్ష్యం ప్రదర్శించారని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. బీజేపీతో ఉన్న స్నేహాన్ని కేవలం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారే తప్ప, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల కోసం ఒత్తిడి చేయలేదని దక్షిణ తెలంగాణ సానునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు.
Also Read: Hydra: బడాబాబుల ఆక్రమణలకు హైడ్రా చెక్.. రూ. 2500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్!
సంతకం చేసిన ద్రోహం
కేసీఆర్ తన హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ(Telangana) వాటాగా కేవలం 299 టీఎంసీలు చాలని సంతకం చేసి,ఉమ్మడి పాలమూరు(Palmuru), రంగారెడ్డి(Rangareddy), నల్గొండ(Nalgonda) జిల్లాల గొంతు కోశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఏపీ ప్రభుత్వం జలదోపిడీ చేస్తుంటే అడ్డుకోకుండా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ చేసిన ఈ చారిత్రక తప్పిదమే ఈరోజు పాలమూరు ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. లక్ష కోట్లకు అంచనాలు పెంచి కమీషన్లు దండుకున్నారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అంచనాలు తక్కువ ఉండటంతో, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం దీన్ని పక్కనబెట్టారని ఆరోపిస్తున్నారు.
అన్నీ డ్రామాలే..
కేంద్రం పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపిందంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సరైన అనుమతులు సాధించలేక, ప్రాజెక్టు లక్ష్యాలను నీరుగార్చడం, నిధులు సమకూర్చకుండా రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండపెట్టారని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని కోర్టులో కేసులు వేసిన వారికే బీఆర్ఎస్ బీ-ఫాం ఇచ్చి కొల్లాపూర్ నుంచి పోటీ చేయించారని తప్పుబడుతున్నారు. తద్వారా ఒకవైపు ప్రాజెక్టు కడుతున్నట్లు నటిస్తూనే, మరోవైపు దాన్ని అడ్డుకునే శక్తులతో కేసీఆర్ చేతులు కలిపారని గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో పూర్తి చేయని ప్రాజెక్టును అడ్డంపెట్టుకొని పొలిటికల్ సర్వైవల్ కోసం కేసీఆర్ తాపత్రయపడుతున్నట్టు స్పష్టమవుతోందనే చర్చ నడుస్తోంది.

