VC Sajjanar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును ప్రస్తుతం సిట్ ఇన్ ఛార్జ్ గా ఉన్న హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ స్వయంగా ప్రశ్నించనున్నట్టు తెలిసింది. కాగా, బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిషనర్ సజ్జనార్ సిట్ బృందంలోని అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను సమీక్షించారు. అదే సమయంలో ఇక ముందు ఎలా విచారణ జరపాలన్న దానిపై కొన్ని మార్గదర్శకాలను సూచించినట్టుగా తెలిసింది.
ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావు ప్రధాన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు అనుమతితో ఆయనను రెండోసారి కస్టోడియల్ విచారణ కోసం అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇంతకు ముందులానే ప్రస్తుతం కూడా ప్రభాకర్ రావు కీలక ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదని తెలిసింది. నేనేం చేశానో అంతా పై అధికారులకు తెలుసని మాత్రమే చెబుతున్నట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఇచ్చిన అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మౌనం వహిస్తున్నట్టుగా తెలియవచ్చింది.
Also Read: VC Sajjanar: తల్లిదండ్రులపై నిర్లక్ష్యం చేస్తే దబిడి దిబిడే.. సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!
ప్రభాకర్ రావును తానే స్వయంగా ప్రశ్నించాలి
స్వయంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావును తానే స్వయంగా ప్రశ్నించాలని సిట్ ఇన్ ఛార్జ్ గా ఉన్న కమిషనర్ సజ్జనార్ నిర్ణయించుకున్నట్టుగా తెలియవచ్చింది. నేడు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోని సిట్ ఆఫీస్ కు రానున్నట్టు సమాచారం. కాగా, సిట్ బృందంలోని అధికారులతో సమావేశమైన కమిషనర్ సజ్జనార్ ఇప్పటివరకు విచారణలో వెల్లడైన వివరాలను తీసుకున్నట్టుగా తెలియవచ్చింది. ఈ కేసులో అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుల వాంగ్మూలాలను అధ్యయనం చేసినట్టుగా సమాచారం. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు తమ తమ స్టేట్ మెంట్లలో వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నట్టుగా తెలిసింది. అయినా, ప్రభాకర్ రావు నోరు తెరవక పోతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను ఒక్కొక్కరిగా ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు
సంధించాలని నిర్ణయించినట్టుగా సమాచారం
ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీం కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ లోని ప్రతీ ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సజ్జనార్ సూచించినట్టుగా తెలిసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ నిశితంగా విచారించాలని చెప్పినట్టు సమాచారం. అన్ని వివరాలు, ఆధారాలతో ఛార్జిషీట్ ను పకడ్భంధీగా తయారు చేయాలని కూడా అన్నట్టుగా తెలియవచ్చింది. ఇక, నేడో…రేపో సిట్ కార్యాలయాన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్ కు మార్చనున్నట్టుగా తెలియవచ్చింది. దీని కోసం ఇప్పటికే సీసీఎస్ లో ఓ గదిని సిద్ధం చేసినట్టుగా సమాచారం.
Also Read: VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

