Uttam Kumar Reddy: ఇరిగేషన్‌ను నాశనం చేసింది కేసీఆరేనని.. ఆయన చేసిన తప్పుల వల్లే నని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇరిగేషన్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90శాతం అబద్ధమని అన్నారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారని.. అది కూలిపోయిందని మండిపడ్డారు. రూ.1. 80వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కారణం.. కేసీఆరేనని ఫైర్ అయ్యారు. ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం తీరును డ్యామ్ సేఫ్టీ అథారిటీ(Dam Safety Authority,), సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుపట్టారని ప్రస్తావించారు. కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్ గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు.
కేసీఆర్ పచ్చి అబద్దాలు
రూ. 38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా పెంచారని ఆరోపించారు. రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. రూ.లక్షల కోట్ల అప్పుతెచ్చి కూడా ప్రాజెక్టు పూర్తి చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండింగ్ ప్రాజెక్టులు కేసీఆర్(KCR) ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బిసి(SLBC), డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలు అడుగుతున్నారని.. కేసీఆర్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని తేల్చిచెప్పారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
కృష్ణా జలాల కోసం గట్టిగా ట్రైబ్యునల్‌లో పోరాడుతున్నామని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల కంటే తక్కువ అడగ లేదని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తప్పుల వల్లే ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని ధ్వజమెత్తారు. ఓడిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు చెప్పడం పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ కు తగదని సూచించారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకెళుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

