Godavari Water Dispute: మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ సర్కార్!
Godavari Water Dispute (imagecredit:twitter)
Telangana News, ఆంధ్రప్రదేశ్

Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

Godavari Water Dispute: కృష్ణా జలాల్లో అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు గోదావరి నీళ్లను కూడా అక్రమంగా తరలించేందుకు కుట్రలు ముమ్మరం చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏపీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పోలవరం-నల్లమల సాగర్ పథకం(Polavaram-Nallamala Sagar project) ద్వారా భారీగా గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆ ప్రాజెక్టు నిర్మించవద్దని కోరుతున్నా, కేసులు వేస్తున్నప్పటికీ వాటిని బేఖాతర్ చేస్తున్నది. పైగా మిగులు జలాలను వాడుకుంటామని వాదిస్తోంది.

పోలవరం ఎత్తు పెంపు

పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం ఉన్న 12 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 18 టీఎంసీలకు పెంచిన ఏపీ సర్కార్, దీనిని భవిష్యత్తులో ప్రతిరోజూ 37 టీఎంసీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు ఎత్తును మూడు దశల్లో పెంచేందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల శాఖకు పంపింది. ఈ డీపీఆర్‌(DPR)కు తక్షణమే ఆమోదం తెలపాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్(CR Patil)‌తో భేటీ అయ్యారు. ధవళేశ్వరం వద్ద ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికే పోలవరం-నల్లమల సాగర్ పథకానికి రూపకల్పన చేశామని ఏపీ ఈ సందర్భంగా వివరించింది. సముద్రంలో కలిసే వరద జలాలపై దిగువ రాష్ట్రంగా తమకే సంపూర్ణ హక్కులు ఉంటాయని, ఈ ప్రాజెక్టుల వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ వాదిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో అర్థం లేదని ఏపీ పేర్కొంటోంది.

తెరపైకి కొత్త డిమాండ్

కృష్ణా ట్రైబ్యూనల్-2 తరహాలోనే గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్-2ను కూడా వ్యవస్థీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ అనుకూల ప్రభుత్వం ఉండటంతో, ఈ కాలయాపన తంత్రం ద్వారా గోదావరి జలాల దోపిడీకి ఏపీ శ్రీకారం చుట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించేందుకు తొలుత ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వ్యూహం మార్చి, దాని స్థానంలో పోలవరం-నల్లమల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. ప్రతిరోజూ మూడు టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా బొల్లాపల్లి నుంచి నల్లమల్ల ప్రాజెక్టుకు నీటిని డైవర్షన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును గరిష్టంగా 45.72 మీటర్ల కంటూరు వరకు నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని, రెండో దశ అంచనాలకు ఆమోదం తెలపాలని ఏపీ కేంద్రాన్ని కోరుతూ అడ్డదారులు తొక్కుతోంది.

Also Read: Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

తెలంగాణ సమరశంఖం

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-నల్లమల్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని ఆరోపిస్తోంది. ముఖ్యంగా గోదావరి-నల్లమల్ల అనుసంధాన ప్రక్రియలో నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పుపడుతోంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, కేంద్ర జలవనరుల సంఘానికి తమ అభ్యంతరాలను అధికారికంగా తెలియజేశారు. తెలంగాణకు సంబంధించి గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మన రాష్ట్ర ప్రాజెక్టుల వాటా తేలకుండా, పూర్తిస్థాయి అనుమతులు రాకుండా ఏపీ ఏకపక్షంగా గోదావరి నీళ్లను ఎలా తరలిస్తుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ నల్లమల్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు గోదావరి జలాల్లో భారీగా నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికే కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్న ఏపీ, ఇప్పుడు గోదావరిలోనూ తెలంగాణ వాటాను అడ్డుకుంటోందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఏపీ వితండవాదం

గోదావరి జలాల విషయంలో ఏపీ కొత్త వాదనలను తెరపైకి తెస్తోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరుతూనే, మరోవైపు నల్లమల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. తాము నిర్మించిన కాళేశ్వరం, సీతమ్మ సాగర్ వంటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం అడ్డుకోలేదని, అలాంటప్పుడు వృధాగా పోయే జలాలను తాము వాడుకుంటామంటే అడ్డుకోవడం సబబు కాదని ఏపీ వితండవాదం చేస్తోంది. అంతేకాకుండా, తెలంగాణలోని అంతర్గత రాజకీయ పరిస్థితులే ఈ వివాదానికి కారణమని ఆరోపణలు మొదలుపెట్టింది.

సుప్రీంలో రిట్ పిటిషన్

ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం విస్తరణ పనులు అంతర్రాష్ట్ర జల వివాదాలను పెంచుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం-బనకచర్ల లేదా పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాలు చట్టవిరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్మాణాలను వెంటనే నిలిపివేసేలా ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ కోరింది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే ఏకంగా 200 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం సొరంగాలు, కాలువలు తవ్వుతోందని తెలంగాణ తన పిటిషన్‌లో ప్రధానంగా పేర్కొంది. ఇది కేవలం సాధారణ విస్తరణ కాదని, నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ చేస్తున్న భారీ మళ్లింపు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Also Read: Adwait Kumar Singh: వరదలు, పరిశ్రమ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!

నిబంధనల ఉల్లంఘనల పరంపర

పోలవరం విస్తరణ విషయంలో ఏపీ ప్రభుత్వం తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గోదావరి నదీ జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డును, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలను, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఏపీ పూర్తిగా బేఖాతర్ చేస్తోందని తెలంగాణ సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో స్పష్టం చేసింది. గోదావరి, కృష్ణా బోర్డుల ఆమోదం, పర్యావరణ అనుమతులు లేదా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే టెండర్లు పిలిచి పనులు చేపడుతోందని ఫిర్యాదు చేసింది.

వరద జలాలపై గందరగోళం

పోలవరం విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రధానంగా వరద జలాల వినియోగాన్ని సాకుగా చూపుతోంది. అయితే, ట్రైబ్యునల్ కేటాయించిన వాటాలు పోగా ప్రత్యేకంగా వరద జలాలు లేదా మిగులు జలాలు అనేవి లేవని తెలంగాణ వాదిస్తోంది. అసలు వరద జలాల మళ్లింపు అనే అంశాన్ని ట్రైబ్యునల్ గుర్తించలేదని, వాటిని వేరుగా గుర్తించే యంత్రాంగమే లేదని కోర్టుకు వివరించింది. వరద జలాల పేరుతో నీటిని తరలిస్తే, అది తెలంగాణకు కేటాయించిన నికర జలాలకు తీరని నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్తోంది. అనుమతించిన 80 టీఎంసీల సామర్థ్యానికి మించి ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన ఏపీ, ఆ తర్వాతే సీడబ్ల్యూసీకి నివేదిక ఇచ్చింది. ‘మా ఆమోదం లేకుండా డీపీఆర్‌కు వెళ్లొద్దు’ అని ఈ నెల 4న సీడబ్ల్యూసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఏపీ బిడ్‌లను తెరవడానికి సిద్ధమైంది.

కేంద్రం ద్వంద్వ వైఖరిపై విమర్శలు

రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చకుండా కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే ఈ వివాదాలకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, గోదావరి ట్రైబ్యునల్-2 ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తెస్తూనే, కాలయాపన ద్వారా ప్రాజెక్టులను నిర్మించుకోవాలని ఏపీ ప్రయత్నిస్తోంది. ఏపీ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోని కరవు పీడిత ప్రాంతాలకు నీటి లభ్యత తగ్గి తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Also Read: Ponnam Prabhakar: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలపై మంత్రి సమీక్ష.. కీలక అంశాలపై చర్చ..!

Just In

01

Medaram Jatara: మహిళలకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ఫ్రీ బస్సు..!

Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

Kishan Reddy: స్పీకర్ ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో అర్థం కావట్లేదు?: కిషన్ రెడ్డి

Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ

Cyber Crime: వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ ముఠా.. పల్లెల్లో బ్యాంక్ ఖాతాలు తీసి..!