GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ జారీ చేస్తున్న ట్రేడ్ లైసెన్స్ ఉచిత రెన్యూవల్ గడువు నేటితో ముగియనున్నది. రెన్యూవల్‌కు శుక్రవారం చివరి రోజు కాగా, రేపటి నుంచి రెన్యూవల్ చేసుకునే వ్యాపారస్తులు పెనాల్టీలను చెల్లించాల్సిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని వ్యాపారాలు, షాపులు, ఇతర కమర్షియల్ సంస్థలు ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు వ్యాపారులను ఆకర్షించేందుకు బల్దియా ఇదివరకే ఉచిత రెన్యూవల్ గడువును పెంచింది.
జీహెచ్ఎంసీ ఆదాయ వనరుల్లో ఒకటైన ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ గడువును గత నెల 11న జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బై ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ గడువు డిసెంబర్ 1న ముగిసేది. కానీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ గడువును ఈ నెల 20వ తేదీ వరకు పెంచింది. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్‌కు గడువు ముగింపునకు 30 రోజుల గడువు ఉండాల్సి ఉంది.
Also Read: GHMC Elections: ఆ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ఇప్పటి నుంచే ఏర్పాట్లకు మౌఖిక ఆదేశాలు!
పెనాల్టీల వడ్డన ఇలా
ఈ నెల 20వ తేదీలోపు రెన్యూవల్ చేసుకుంటే ఎలాంటి జరిమానాలు వర్తించవని జీహెచ్ఎసీ అధికారులు తెలిపారు. 20వ తేదీ తర్వాత వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 19 తేదీ లోపు రెన్యూవల్ చేసుకునే వ్యాపార సంస్థలకు వారు చెల్లించే ట్రేడ్ లైసెన్స్ ఫీజులో 25 శాతాన్ని అదనంగా జరిమానాగా విధించనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2026 తర్వాత రెన్యూవల్ చేసుకునే ట్రేడ్ లైసెన్స్‌లకు వారు చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించనున్నట్లు వెల్లడించారు. ఇక ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను గుర్తించి అప్పటికప్పుడు లైసెన్స్‌లను జారీ చేసి, వారు చెల్లించాల్సిన ట్రేడ్ ఫీజును వంద శాతం అదనంగా జరిమానాగా వసూలు చేయనున్నారు.
ప్రతి నెలా పది శాతం ట్రేడ్ ఫీజు
ఇందుకు తోడు, లైసెన్స్ పొందే వరకు ప్రతి నెలా పది శాతం ట్రేడ్ ఫీజును అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనకు సంబంధించి 2017లోనే జీహెచ్ఎంసీ తీర్మానం చేసినట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ. 5 వేలు ట్రేడ్ ఫీజుగా చెల్లిస్తున్న వ్యాపార సంస్థలు గ్రీన్ ఫండ్ గా పది శాతాన్ని చెల్లించాల్సి ఉంటుందని, రూ. 5 వేల కన్నా ఎక్కువ ట్రేడ్ ఫీజు చెల్లిస్తున్న వ్యాపార సంస్థలు అదనంగా రూ. వెయ్యిని గ్రీన్ ఫండ్‌గా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
నో డిజిటల్ చెల్లింపులు
డిజిటల్ చెల్లింపులతో కూడా ట్రేడ్ లైసెన్స్ లు రెన్యూవల్ చేసుకోచ్చునన్న జీహెచ్ఎంసీ ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం చెక్కు, డీడీ, నగదు రూపంలోనే రెన్యూవల్ రుసుము స్వీకరిస్తుండటంతో రెన్యూవల్ కోసం వచ్చిన వ్యాపారుల్లో ఎక్కువ మంది డిజిటల్ చెల్లింపులపైనే ఆసక్తి చూపుతున్నారు. కానీ, డిజిటల్ చెల్లింపులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది వ్యాపారులు రెన్యూవల్ చేసుకోకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలిసింది.
Also Read: GHMC Ward Delimitation: పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణకు..హైకోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్ గడువు!

