Khammam Gurukulam: క్రీడలు మానసికోల్లాసానికే కాకుండా విద్యార్థులలో సమైక్యత భావాన్ని పెంపొందిస్తాయని ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎండీ ముజాహిద్ అన్నారు. కారేపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముజాహిద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం గాలిలోకి బెలూన్లను వదిలి క్రీడలను ప్రారంభించిన ఆయన, విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్య
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎండబ్ల్యూవో ముజాహిద్ మాట్లాడుతూ.. మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 13 గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని, వీటిలో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.1.35 లక్షలు ఖర్చు చేస్తోందని, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకుందని ఆయన కొనియాడారు.
Also Read: Gurukulam Scam: పీఎంశ్రీ పథకం నిధుల గోల్‌మాల్.. బోగస్ బిల్లులతో టీచర్ల జేబుల్లోకి నగదు!
975 మంది విద్యార్థినులు
మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్రీడా పోటీలలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 13 పాఠశాలల నుంచి సుమారు 975 మంది విద్యార్థినులు పాల్గొంటున్నారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో వాలీబాల్, ఖోఖో, టెన్నికాయింట్, బాల్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడలలో విద్యార్థినులు తమ ప్రతిభను చాటుకోనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ గురుకుల ఇంచార్జీ శ్రీనివాస్, రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, డీఏసీ అప్రోజ్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్‌లు డీ సావిత్రి, పసుపులేటి శైలజ, సంగీత, గీత, అఖిల, సీత, బిపాషా, పరహిన, జ్యోతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Gurukulam: సవాళ్ల నడుమ నడుస్తున్న గురుకులాలు.. సమస్యలు సృష్టిస్తున్న పాత కాంట్రాక్టర్లు

