KCR: కరివేన ప్రాజెక్టును సందర్శించే అవకాశం
ఈనెల 21న జరిగే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో క్లారిటీ
ఇప్పటికే పాలమూరు నేతలకు పార్టీ సమాచారం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఉమ్మడి పాలమూరు జిల్లాకు గులాబీ పార్టీ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) వెళ్లనున్నట్లు సమాచారం. ఈనెల 27 లేదా 28 పర్యటించనున్నారని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని.. ఇప్పటికే కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కృష్ణా – గోదావరి జలాల్లో తెలంగాణకు రావలసిన వాటాను సైతం తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు.
కరివేన ప్రాజెక్ట్ అనేది తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగం. ఇది మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది నుండి నీటిని ఎత్తిపోసి, వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం 50 టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రధాన రిజర్వాయర్లలో ఒకటి. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా 2025 మధ్య నాటికి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లను పూర్తి చేసి 50 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, తద్వారా ఈ ప్రాంతాల వ్యవసాయ, తాగునీటి అవసరాలు తీర్చబడతాయి. అయితే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పనులు చేపట్టారు. అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం లోనే 80 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేళ్లలో కూడా 20 శాతం పనులు పూర్తి చేయలేదని.. ప్రజలపై రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పిస్తుంది. అందులో భాగంగానే కరివేన ప్రాజెక్టును సందర్శించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా పర్యటనకు సంబంధించి ఇప్పటికే నేతలు ఏర్పాటు చేసుకోవాలని సూచన చేసినట్లు తెలిసింది. ఈనెల 21న టిఆర్ఎస్ ఎల్పి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో ఈ కరివేన ప్రాజెక్టు పర్యటన తేదీ ఖరారు అవుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కెసిఆర్ పర్యటన మాత్రం జిల్లాలో ఉంటుందని సమాచారాన్ని ఇచ్చినట్లు నేతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు దేవరకద్ర నియోజకవర్గంలో ఉండడంతో అక్కడ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత తొలిసారి కెసిఆర్ ప్రాజెక్టుల సందర్శన చేపడుతున్నారు. అయితే ఆయన ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు.. కృష్ణ గోదావరి జలాల వాటాలపై ఎలాంటి అంశాలను లేవనెత్తుతారు… ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలు సంధిస్తారు.. ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ ఏమన్నా చేపడతారా.. ఎలా ముందుకు పోతారు అనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాశమైంది. కెసిఆర్ ఈ పాలమూరు పర్యటనతో పార్టీలో జోష్ నింపబోతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also- India vs South Africa: చివరి టీ20లో టాస్ పడింది.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏం ఎంచుకున్నాడంటే?

