కడప, స్వేచ్ఛ: కడప జిల్లాలో కూటమి నేతల మధ్య పొసగడం లేదు. ఇద్దరు కూటమి లీడర్ల మధ్య వార్ నడుస్తోంది. అధిష్టానం నచ్చజెప్పినా తీరు మారడం లేదు. ఈ ఇద్దరి నేతల వ్యవహారం మరోసారి హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) ప్లైయాష్ కోసం గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య గొడవ జరగడం, వార్నింగ్‌లు ఇచ్చుకోవడం జరిగింది. స్వయంగా సీఎం చంద్రబాబు కలుగజేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
అయితే స్థానిక టీడీపీ కూటమి నేతల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. పాండ్ యాష్ ప్లాంట్‌లో లోడింగ్ విషయంలో వివాదం తలెత్తగా సంజీవరెడ్డి, రామ్మోహన్‌రెడ్డిల వర్గీయులు కర్రలతో విచక్షణారహితంగా పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇదంతా పోలీస్‌స్టేషన్ సమీపంలోనే, ఎస్ఐ ఎదుటే ఈ గొడవ జరగడం గమనార్హం. భారీగా మొహరించిన పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గీయులను చెదరగొట్టారు. కాగా సంజీవరెడ్డి.. ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డికి, రామ్మోహన్.. జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరూ ప్రతిసారీ ఈ బూడిద విషయంలో గొడవలు పడుతుండటంతో స్థానికులు మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారం మరోసారి పెద్దల వరకు చేరినట్టు తెలుస్తోంది. ఈ సారి ఎలాంటి యాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.