Live in Relationships: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు సమాజంలో అందరికీ నచ్చక పోయిన, వాటిని అక్రమమని పిలవలేమని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని భయం ఉందని ఫిర్యాదు చేసిన 12 జంటలకు పోలీసు రక్షణ కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ఏకసభ్య ధర్మాసనం ముందు దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, వివాహ బంధం లేకుండానే కలిసి జీవించడం నేరం కాదని స్పష్టం చేసింది. లివ్-ఇన్ సంబంధాల్లో ఉన్న 12 మంది మహిళలు తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై స్పందించిన న్యాయస్థానం, సంబంధిత జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా వారి శాంతియుత జీవనంలో అంతరాయం కలిగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని చదువు పోరాటం.. తల్లిదండ్రుల కలను నిజం చేసిన కుమారుడు!
“వ్యక్తి చిన్నవాడా, పెద్దవాడా, వివాహితుడా, అవివాహితుడా అన్న తేడా లేకుండా ప్రతి పౌరుడి జీవించే హక్కు అత్యున్నత స్థాయిలో పరిరక్షించాల్సిందే. వివాహం జరగలేదన్న ఒక్క కారణంతోనే రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులను ఎవరికీ నిరాకరించలేం” అని వ్యాఖ్యానించారు.
పిటిషనర్లు తమకు ఎదురవుతున్న బెదిరింపులపై పోలీసులను ఆశ్రయించినప్పటికీ, స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులను పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, “వారు వయస్సు పరంగా పెద్దవారని, స్వచ్ఛందంగా కలిసి జీవిస్తున్నారని నిర్ధారించిన వెంటనే పోలీసులు తక్షణ రక్షణ కల్పించాల్సిందే” అని స్పష్టం చేసింది.
ఈ 12 పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన హైకోర్టు, “ పిటిషనర్లు పెద్దవారు. వివాహం చేసుకోకుండా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయాన్ని తీర్పు చెప్పే హక్కు కోర్టులకు లేదు. వారు ఎలాంటి నేరం చేయనప్పుడు, రక్షణ కోరిన వారి అభ్యర్థనను తిరస్కరించే అవసరం లేదు” అని పేర్కొంది.
Also Read: Kingfisher – ED: కింగ్‌ఫిషర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. మాజీ ఉద్యోగులకు రూ.300 కోట్ల నిధులు విడుదల
వారు శాంతియుతంగా కలిసి జీవించేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఎవరూ వారి జీవనంలో జోక్యం చేసుకునే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, పిటిషనర్లు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా చట్టబద్ధమైన పత్రాల ద్వారా తాము మెజారిటీ వయస్సు చేరుకున్నారని చూపిస్తే, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. పత్రాలు లేనిపక్షంలో, గ్రామీణ ప్రాంతాలకు చెందిన లేదా చదువు లేని యువత విషయంలో వయస్సు నిర్ధారణ కోసం ఆసిఫికేషన్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.
లివ్-ఇన్ సంబంధాలు భారత సమాజంలో ఇంకా పూర్తిగా అంగీకరించబడలేదని, వాటిపై సామాజిక ముద్ర, నైతిక చర్చ కొనసాగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. “ పాశ్చాత్య ఆలోచనలకు భారతదేశంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కూడా అలాంటి ఆలోచనే. కొందరికి ఇది అనైతికంగా అనిపిస్తే, మరికొందరు అనుకూలత కోసం తీసుకునే సరైన నిర్ణయంగా భావిస్తారు” అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తీర్పుతో లివ్-ఇన్ సంబంధాలపై మరోసారి న్యాయపరమైన స్పష్టత వచ్చింది.

