Illegal Mining: రంగారెడ్డి జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్
Illegal Mining ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Illegal Mining: రంగారెడ్డి జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్.. చూసీ చూడనట్టుగా అధికారుల తీరు!

Illegal Mining: జిల్లాలో మట్టి, రాయి, ఇసుక తవ్వకాలు, తరలింపులో నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపి నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నారు. మైనింగ్ తవ్వకాలపై సరియైన పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతున్నది. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.

రాయల్టీల ఎగవేత

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో జరిగే అక్రమ మైనింగ్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటి వరకు గుట్టుగా అక్రమ తవ్వకాలు జరిపి వ్యాపారం చేసుకొని రాయల్టీలు ఎగవేస్తున్నారు. ఈ రాయల్టీలను ముక్కు పిండి వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్, సరూర్ నగర్​, హయత్ నగర్​, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, గండిపేట, శంషాబాద్ మండలాల్లో మైనింగ్​ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. అధిక సంఖ్యలో దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు తగినంత అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణలో లోపం జరిగినట్లు హై లెవెల్ అధికారులు వివరిస్తున్నారు.

Also Read: Illegal Mining: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ

కేవలం నోటీసుకే పరిమితం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ పరిధిలోని సర్వే నెంబర్​ 167/2లో ఓ నిర్మాణ సంస్థ భారీగా తవ్వకాలు జరిపింది. ఇప్పటి వరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు. గతంలో రూ.9 కోట్లకు పైగా జరిమానా విధించినట్లు సమాచారం. అదే విధంగా తట్టి అన్నారం సర్వే నెంబర్​ 121లో భారీగా అక్రమాలు జరిగాయి. అందుకు అధికారులు రూ.3కోట్ల జరిమానా వేశారు. కానీ ఒక్క పైసా కూడా వసూలు కాలేదు. దీని వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతున్నది. అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయి. అలాంటి తవ్వకాలపై అధికారులు నోటీసుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. జిల్లాలో జరిగే అక్రమ తవ్వకాలపై రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నోటీసులు ఇచ్చి నిర్మాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్నది. ఆమ్యామ్యాలతో కేవలం నోటీసుల వరకే అంతా సైలెంట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఆదాయానికి మార్గం.. రెవెన్యూ రికవరీ యాక్ట్

విస్తరిస్తున్న నగరంలో గేటెడ్​ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం సాగుతున్నది. ఈ నిర్మాణాలు గండిపేట్​, రాజేంద్రనగర్​, శేరిలింగంపల్లి, బాలాపూర్​, ఎల్బీనగర్​, సరూర్ నగర్, హయత్ నగర్​, శంషాబాద్​, అబ్దుల్లాపూర్​ మెట్​ మండలాల్లో ఎక్కువగా కొనసాగుతున్నాయి. సెల్లార్​ తవ్వకాలు అయితే జోరుగా సాగుతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూకు అధికారులు గండి కొడుతున్నారు. ఈ వ్యవస్థకు స్వస్తి పలకాలని ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం.

తెలంగాణ వ్యాప్తంగా మైనింగ్ తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తే ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే మొండి బకాయిలు వసూలు చేయడం సహా రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.4,800 కోట్లు సమకూరే అవకాశం లేకపోలేదు. కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వాళ్లపై, రెవెన్యూ వాళ్లు పోలీసులపై నెట్టేసి తప్పించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్ఆర్ యాక్ట్ అమలుతో ఇప్పటి వరకు తిన్నదంతా కక్కించొచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు పెనాల్టీల వసూళ్ల కోసం పకడ్బందీగా అమలులోకి తీసుకురాబోతున్నట్టు తెలిసింది.

Also Read: Illegal Soil Mining: రావల్ కోల్ గ్రామంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. పట్టించుకోని అధికారులు

Just In

01

Panchayat Elections: తెలంగాణ పల్లెల్లో కలహాలు పెట్టిన పంచాయతీ ఎన్నికలు..!

Sigma Movie Update: సందీప్ కిషన్ ‘సిగ్మా’ షూటింగ్ పూర్తి.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే?

Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు

Uttam Kumar Reddy Warning: భయం ఉన్నోళ్లు వెళ్లిపోండి.. నేను రంగంలోకి దిగుతా.. మంత్రి ఉత్తమ్ ఆగ్రహం

Live-in Relationships: లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ చట్టవిరుద్ధం కావు.. 12 జంటలకు రక్షణ ఇచ్చిన హైకోర్టు