GHMC Ward Delimitation: జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు సమర్పించే గడువును తెలంగాణ హైకోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. పిటిషనర్ల అభ్యర్థన మేరకు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యంతరాలు తెలపాలనుకునే వారికి మరికొంత సమయం లభించినట్లయింది. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. సెన్సస్ కమిషనర్ విధించిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ దృష్ట్యా, గడువును ఎక్కువగా పొడిగించలేమని కోర్టు స్పష్టం చేసింది. 19వ తేదీ సాయంత్రం వరకు అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కోర్టుకు నివేదించే అవకాశం ఉంది.
వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
గత సోమవారం నాటికి 3,102 అభ్యంతరాలు రాగా, మంగళవారం ఒక్కరోజే 1,475 అభ్యంతరాలు వచ్చాయి. బుధవారం నాటికి వీటి సంఖ్య దాదాపు 4,616 కు చేరింది. ఇందులో ప్రధానంగా 30 శాతం అభ్యంతరాలు వార్డుల పేర్లు మార్చడం, సరిహద్దుల మార్పుపైనే ఉన్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుపై 15 శాతం వినతులు వచ్చాయి. జోన్ల విలీనం, పునర్వ్యవస్థీకరణపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతి జోన్‌కు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలను నియమించింది. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ కమిటీలు పని చేస్తాయి. పారదర్శకత కోసం ఈ కమిటీలోని అధికారుల వివరాలను గోప్యంగా ఉంచారు. అందిన ఆర్జీల్లో పరిష్కరించగలిగే వాటిని రెండు రోజుల్లోనే డిస్పోజ్ చేయాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.
వార్డుల పేర్లు మారే అవకాశం
డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా పదుల సంఖ్యలో వార్డుల పేర్ల మార్పుపై సలహాలు వచ్చాయి. పాతబస్తీ, న్యూసిటీతో పాటు విలీనమైన 27 సర్కిళ్లలోని పలు వార్డుల పేర్లకు సంబంధించి అధికారులు అభ్యంతరాలను స్వీకరించారు. ఈ రకంగా పదుల సంఖ్యలో అభ్యంతరాలు, సలహాలు రాగా, వాటిలో 5 నుంచి 10 వార్డుల పేర్ల మార్పునకు ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే బాగ్ అంబర్‌పేట పేరుతో ఉన్న డివిజన్‌కు అధికారులు ‘డీడీ కాలనీ’ అని కొత్త వార్డును ఏర్పాటు చేశారు.
ప్రజాప్రతినిధులు కోరిన పేర్లను కంటిన్యూ
కానీ, ఆ వార్డుకు బాగ్ అంబర్ పేట వార్డు అనే పేరును కొనసాగించాలని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వార్డుల పేర్ల మార్పు చాలా చిన్న పనని, ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరిన పేర్లను కంటిన్యూ చేసేందుకు కమిషనర్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఒక వార్డు పరిధి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుని పునర్విభజన చేసినప్పటికీ, మరోసారి పరిశీలించేందుకు అధికారులు సిద్దమైనట్లు సమాచారం.

