YouTube Reporter Arrest: యూ ట్యూబ్ ఛానల్‌ను అడ్డం పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న రిపోర్టర్‌ను శాలిబండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శాలిబండ ప్రాంతంలో ఉంటున్న సయ్యద్ బిలాల్(Syed Bilal) అనే వ్యక్తి ఓ యూ ట్యూబ్ ఛానల్(YouTube channel) పెట్టుకుని దాని పేర పైరవీలు.. బ్లాక్ మెయిల్ చేస్తూ జనం నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఇటీవల ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా అరెస్ట్ కాకుండా పోలీసులతో మాట్లాడుతానని చెప్పి 35వేల రూపాయలు అడిగాడు. అడిగినంత ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు. దాంతో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు సయ్యద్ బిలాల్ ను బుధవారం అరెస్ట్ చేశారు.
ఖబడ్ధార్..
పాతబస్తీలో పలువురు ఇలాగే యూ ట్యూబ్ ఛానళ్ల పేర సెటిల్ మెంట్లు.. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే(DCP Kiran Khare) చెప్పారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఆ వెంటనే కేసులు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా యూ ట్యూబ్ ఛానళ్ల పేర వసూళ్ల దందా చేస్తున్న వారి గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.
Also Read: IDPL Land Issue: రవీందర్ రావు బాగోతాన్ని మొత్తం బయటపెడతా: శ్రీకాంత్ గౌడ్

