Panchayat Elections: రాష్ట్రంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబూషన్ సెంటర్ల నుంచి మంగళవారం ఎన్నికల సిబ్బంది పోలింగ్సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. సర్పంచ్, వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు.
36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
మూడో విడత 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇది ఇలా ఉంటే రెండు గ్రామ పంచాయతీలు, 18 వార్డుల ఎన్నికలు జరగడం లేదు.ఈ విడుదల ఓటర్ల సౌకర్యార్థం కోసం ఓటేసేందుకు 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు
3,547 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఆర్వోలు 4,502 మంది, పోలింగ్ సిబ్బంది 77,618 మంది, మూడు విడతలకు మైక్రో అబ్జర్వర్లు 2,489, బ్యాలెట్ బాక్స్‌లు 43,856 అందుబాటులో ఉంచారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఈ విడతలో మొత్తం 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషులు 26,01,861 మంది ఉండగా, మహిళలు 27,04,394 మంది, ఇతరులు 140 మంది ఉన్నారు. దాదాపు లక్ష మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదార్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు.. ఇలా ఎస్ఈసీ సూచించిన18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటర్లు ఓటు వేయవచ్చు అని ఎన్నికల సంఘం సూచించింది.
రూ.9 కోట్లు సీజ్.. ప్రకటించిన ఎన్నికల అధికారులు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలయప్పట్నుంచి అధికారులు పకడ్బంద్ చర్యలు చేపట్టారు. నిత్యం పర్యవేక్షణ చేశారు. మూడో విడతలో దాదాపు రూ.9.11 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రూ. 2.09 కోట్ల నగదు, రూ. 3.81 కోట్ల మద్యం, రూ. 2.28 కోట్లు డ్రగ్స్-నార్కోటిక్స్, రూ. 12.20 లక్షల విలువైన బంగారం/ ఆభరణాలు, ఇతరాలు 78.33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి
ఎలాంటి ఘటన జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 36,165 మందిని బైండోవర్ చేయగా.. 912 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయించుకుందామని తెలిపారు. ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల సంఘం టీఈ–పోల్ (Te-poll) అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని సూచించారు. ఫిర్యాదుల కోసం 9240021456 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Panchayat Elections: మూడవ విడుత ఎన్నికలకు సర్వం సిద్ధం : కలెక్టర్ బీఎం సంతోష్

