West Bengal Sports Minister: అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా కోల్ కత్తాలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బెంగాల్ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. అంతేకాదు సీఎం మమతా బెనర్జీకి అరూప్ బిస్వాస్ రాసిన రాజీనామా లేఖను సైతం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్రీడల మంత్రి రాజీనామాను దీదీ సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది.
లేఖలో ఏముందంటే?
సీఎం మమతా బెనర్జీకి రాసిన లేఖలో క్రీడా మంత్రి బిస్వాస్ కీలక అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. ‘దీదీ, మీకు నా నమస్కారాలు. డిసెంబర్ 13న మెస్సీ వచ్చారు. ఆ సందర్భంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీరు ఇప్పటికే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. నిష్పక్షపాత విచారణ జరగాలంటే పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రిగా ఉన్న నా బాధ్యతల నుంచి నన్ను విముక్తి చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి నా అభ్యర్థనను ఆమోదించండి’ అని మమతా బెనర్జీకి రాసిన లేఖలో ఆరూప్ బిస్వాస్ పేర్కొన్నట్లు సమాచారం.
దీదీ చేతిలోనే క్రీడాశాఖ!
అయితే బిస్వాస్ రాజీనామాను మమత తాత్కాలికంగా మాత్రమే ఆమోదించినట్లు తెలుస్తోంది. మెస్సీ ఈవెంట్ ఇష్యూపై విచారణ పూర్తయ్యేవరకూ ఆయన క్రీడా మంత్రిగా కొనసాగలేరని తెలుస్తోంది. అప్పటివరకూ ఆ శాఖను సీఎం మమతా బెనర్జీనే నిర్వర్తించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘క్రీడల మంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయం, ఉద్దేశాన్ని గౌరవిస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది.
గందరగోళం ఎందుకంటే?
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ G.O.A.T ఇండియా టూర్ లో భాగంగా శనివారం కోల్ కత్తా నగరానికి వచ్చారు. ఆయన సాల్ట్‌లేక్ స్టేడియంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మెస్సీ గ్రౌండ్ లో తిరగకపోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువ లేకపోవడంతో అభిమానులు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మైదానంలోకి వచ్చిన ఫ్యాన్స్ కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరేశారు. స్టేడియం వద్దకు సీఎం మమతా కూడా రావాల్సి ఉండగా.. గందరగోళం దృష్ట్యా ఆమె ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
Also Read: TTD Board Meeting: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. ప్రతీ భక్తుడు తెలుసుకోవాల్సిందే!
సీరియస్‌గా తీసుకున్న దీదీ
మరోవైపు మెస్సీకి సారీ చెప్పిన మమతా.. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు అందులో చోటు కల్పించింది. ప్రస్తుతం ఘటనకు సంబంధించి ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి స్టేడియానికి సంబంధించిన సీఈఓ దేవ్ కుమార్ నందన్ సైతం పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్ సైతం పదవికి రాజీనామా చేయడం చూస్తే.. మెస్సీ ఇష్యూని మమతా ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోంది.

