GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.
GHMC (image credit: swetcha reporter)
Political News

GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!

GHMC: ఇటీవల పెరిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు తీసుకున్న 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో అనివార్యమైన వార్డుల పునర్విభజనపై అధికార, విపక్షాల పార్టీల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టారాజ్యంగా, ఎకపక్షంగా జరుగుతున్న వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం కమిషనర్ కర్ణన్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తొలుత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్‌లను కలిసి వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు.

ఒక ప్రామాణికంగా జరగాలి

తమ అభిప్రాయాలను, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మేయర్, కమిషనర్‌ను కోరారు. ఆ తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దాసోజు శ్రవణ్ పలువురు కార్పొరేటర్లతో కలిసి మేయర్, కమిషనర్లకు వినతి పత్రాలను సమర్పించారు. ఆ తర్వాత బీజేపీ కార్పొరేటర్లు కూడా కమిషనర్, మేయర్‌ను కలిసి డీలిమిటేషన్ పారదర్శకంగా, ఒక ప్రామాణికంగా జరగాలని, ఈ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పునర్విభజన సక్రమంగా జరగాలని కోరుతూ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు కూడా పునర్విభజనపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేసిన వీ వాంట్ జస్టిస్ నినాదాలతో కమిషనర్ ఛాంబర్ మార్మోగింది.

వార్డుల డీలిమిటేషన్‌పై మాకు కన్ఫ్యూజన్ ఉంది: ఎమ్మెల్యే దానం నాగేందర్

గ్రేటర్ పరిధిలోని వార్డుల పునర్విభజన‌పై తమకు, తమ పార్టీ కార్పొరేటర్లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ఎంతో కన్ఫ్యూజన్ ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. పునర్విభజన శాస్త్రీయంగా నిర్వహించాలని కోరుతూ మేయర్, కమిషనర్లకు వినతి పత్రాలను సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, డీ లిమిటేషన్ జరుగుతున్న తీరుపై కార్పొరేటర్లలో ఆవేదన ఉందని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే పునర్విభజన ప్రక్రియను చేపట్టారన్నారు. తమ అభ్యంతరాలు మేయర్, కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఎమ్మెల్యే వెల్లడించారు. జీహెచ్ఎంసీ విస్తరణ జరగడం బాగుంది, కానీ, తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని వాటిని కూడా పరిగణలోకి తీసుకొని పునర్విభజన చేయాలని కోరినట్లు దానం వివరించారు.

పునర్విభజనలో ఉన్న సమస్యలను గుర్తించాం : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

వార్డుల పునర్విభజన ప్రక్రియలో తలెత్తిన సమస్యలను, అనేక అంశాలను గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వెల్లడించారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు, మరికొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లతో పునర్విభజన జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రతి విషయాన్ని మేయర్, కమిషనర్‌కు వివరించామన్నారు. మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో తాము గుర్తించిన అంశాలపై డీటెయిల్‌గా చర్చిస్తామన్నారు. బౌండరీస్ తెలియకుండా అధికారులు వాటిని ఫిక్స్ చేశారన్నారు.

ఏ పార మీటర్ ఆధారంగా వార్డుల విభజన చేశారో?: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

వార్డుల పునర్విభజన ఏ పారా మీటర్ ఆధారంగా చేస్తున్నారో కూడా తెలపటం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. పాపులేషన్ ఆధారంగా వార్డులను విభజించామని అధికారులు చెబుతున్నా, త్వరలోనే తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేస్తామన్నారు. వార్డుల డీలిమిటేషన్‌లో తలెత్తిన లోపాలు, సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలియజేస్తామన్నారు. ఎలాంటి పారామీటర్స్ తీసుకున్నారనేది మాత్రం ఇప్పటికి అధికారులు తెలియజేయలేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పారని పేర్కొ్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ చేయాలని కోరామన్నారు.

Also Read: MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

డీలిమిటేషన్ ఇష్టానుసారంగా చేశారు : మాజీ మంత్రి తలసాని

గ్రేటర్‌లోని వార్డుల డీలిమిటేషన్‌ను అధికారులు ఇష్టారాజ్యంగా చేశారని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. డీలిమిటేషన్ శాస్త్రీయంగా చేయాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించాలని కోరుతూ మేయర్, కమిషనర్ ఆయన ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌తో కలిసి వినతి పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వార్డుల పునర్విభజన ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి శాస్త్రీయంగా జరపాలని కోరినట్లు వెల్లడించారు. అధికారులు ఫీల్డ్ లెవల్‌లో తిరగకుండా, పరిస్థితులను పర్యవేక్షించకుండానే ఆఫీస్‌లో కూర్చొని ల్యాప్ టాప్‌లో పునర్విభజన చేశారని ఆరోపించారు. మంగళవారం నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో దీనిపై కొట్లాడుతామన్నారు. అవసరమైతే న్యాయపరంగా కూడా పోటీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. 300 వార్డులకు సరిపోయే స్టాఫ్ ఉందా? అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని తలసాని సూచించారు.

బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేలా పునర్విభజన చేశారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్ సిటీలో ఏ మాత్రం పట్టులేని అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేలా ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎలాంటి సాంకేతిక పరమైన చర్యలు తీసుకోకుండానే వార్డులను పునర్విభజించాలని ఆరోపించారు. డీలిమిటేషన్ విషయంలో మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్తారా? రాచరికంగా వెళ్తున్నారా? అని కమిషనర్‌ను అడిగామని తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వెళ్ళకపోతే ఖచ్చితంగా కోర్టు తలుపులు తడతామని ఆయన వెల్లడించారు.

400 మంది కౌన్సిలర్ల ఏరియాను 16 వార్డులుగా చేశారు : మాజీ మంత్రి మల్లారెడ్డి

గ్రామీణ ప్రాంతంలో ఉండే మేడ్చల్‌లో 7 మున్సిపాలీటీలు, 3 కార్పొరేషన్లుగా ఉన్న ఏరియాను కేవలం 16 వార్డులుగా పునర్విభజించారని మాజీ మంత్రి మల్లారెడ్డి వాపోయారు. మేడ్చల్, కీసర ఇంకా అభివృద్ది చెందుతున్నాయని, ఎక్కడో బంజారాహిల్స్‌లాగా కీసర ఎలా ఉంటుందని ప్రశ్నించారు. విలీనంతో ట్యాక్స్‌లు పెరుగుతాయని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 400 మంది కౌన్సిలర్లు ఇన్నోవా కార్లు వేసుకుని మేడ్చల్‌లో తిరిగేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 16కు కుదించారన్నారు.

వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలి : బీజేపీ కార్పొరేటర్లు

వార్డుల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా జరపాలని కోరుతూ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి నేతృత్వంలో కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌కు వినతి పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, తమ అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అశాస్త్రీయంగా వార్డుల విభజన చేశారని ఆరోపించారు. ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందన్నారు. తుర్కయంజాల్‌ను చార్మినార్ జోన్‌లో కలపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బడంగ్‌పేట, తుర్కయాంజల్‌ను ఎల్బీనగర్‌లో కలపాలని, లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. డీ‌లిమిటేషన్‌పై 2 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయంటే పునర్విభజన ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఓల్డ్ సిటీలో తక్కువ జనాభాతో ఎక్కువ వార్డులు వచ్చేలా డీలిమిటేషన్ చేశారని, నగర శివార్లలో ఎక్కువ జనాభా ఉంటే తక్కువ వార్డులను ఏర్పాటు చేశారన్నారు.

Also Read: GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?