WhatsApp Scam: వాట్సప్‌లో వచ్చిన ఓ మెసేజ్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కష్టపడి సంపాదించిన రూ.75 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. వివరాల్లోకెళ్తే, హైదరాబాద్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి నాలుగేళ్ల క్రితం గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా, క్రికెట్, తీన్ పత్తి, క్యాసినో వంటి గేములున్న బెట్టింగ్ యాప్ కనిపించింది. దాంతో పాటు ‘ఫైవ్ స్టార్క్రికెట్ ఏవియేటర్ ఫ్లైట్ గేమ్’ అనే ప్లాట్‌ఫామ్ కూడా అందులో ఉంది. ఆడి చూడండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి లక్షలు సంపాదించవచ్చని ఉండటంతో ఆశపడ్డ సదరు వ్యక్తి మొదట ఆ గేమ్‌లో రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టాడు. దీనిపై కొంత లాభం వచ్చినట్టుగా సైబర్ క్రిమినల్స్ అతడికి చూపించారు. నగదును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. దాంతో యాప్‌ను పూర్తిగా నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.10 లక్షలను బెట్టింగులుగా పెట్టి ఆ డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. దాంతో ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడటం మానేశాడు.
Also Read: SIM Box Scam: సిమ్ బాక్స్ వ్యవస్థతో నయా మోసం.. ఎలా చేశారో తెలిస్తే షాక్ కావాల్సిదే..?
ఉచ్చులో పడకండి
అయితే, 2022లో మరోసారి బాధితునికి వాట్సప్‌ద్వారా మరో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ పంపించిన కేటుగాళ్లు, ప్రతిసారీ దురదృష్టం వెంటాడదు, ఆడి చూడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చని ఉచ్చులోకి లాగారు. దాంతో ఆశపడ్డ బాధితుడు అప్పటి నుంచి ఇటీవలి వరకు ఏకంగా రూ. 75 లక్షల రూపాయలను బెట్టింగుల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఆ తరువాత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో, ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించవచ్చని సైబర్ క్రిమినల్స్ వేసే ఉచ్చులో చిక్కుకోవద్దంటూ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్గేములైన క్యాసినో, క్రికెట్, తీన్‌పత్తి వంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. మొదట్లో కొన్ని లాభాలు వచ్చినట్టుగా చూపించి కేటుగాళ్లు కష్టార్జితం మొత్తాన్ని కొట్టేస్తారన్నారు.
Also Read: Powerstar Srinivasan: రూ. 5 కోట్ల మోసం కేసులో పవర్ స్టార్ అరెస్ట్?

